యూనిఫాంకు ‘మంగళం' | Yuniphanku 'Mangalam' | Sakshi
Sakshi News home page

యూనిఫాంకు ‘మంగళం'

Published Mon, Oct 6 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

యూనిఫాంకు ‘మంగళం'

యూనిఫాంకు ‘మంగళం'

కర్నూలు(హాస్పిటల్):
 ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫాం, క్లీనింగ్ కోసం ప్రతి నెలా అలవెన్స్, రూ.వేలల్లో వేతనం అందిస్తే.. ఏ ఉద్యోగి అయినా చక్కగా విధులు నిర్వహిస్తారు.  ఈ పరిస్థితి ఇతర శాఖల్లో కనిపిస్తుందేమో కానీ.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు మాత్రం ఇందుకు భిన్నం. యూనిఫాం వేసుకోకపోవడమే కాదు.. పనివేళలు కూడా వీరికి పట్టవు. వచ్చిన వారు సైతం చుట్టపు చూపుగానే  హాజరవుతుండటం.. లేదంటే బినామీలతో పని చేయిస్తూ సొంత వ్యాపారాలు చూసుకోవడం వీరికే చెల్లింది. ప్రధానంగా  ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓల పనితీరు విమర్శలకు తావిస్తోంది.  కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఓపీ, ఐపీ కలుపుకొని మొత్తం 60 వార్డులు ఉన్నాయి.

కింది స్థాయిలో రోగికి సేవలందించాల్సిన మేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎంఎన్‌ఓ), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎఫ్‌ఎన్‌ఓ)లు కలిపి 114 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు తోటీలు 37 మంది, స్వీపర్లు 26 మంది, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, టైలర్, కార్పెంటర్, బార్బర్ వంటి పోస్టుల్లో ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సీనియర్ ఉద్యోగులు ప్రతి నెలా  రూ.50 వేల వేతనం పొందుతున్నారు. అయితే విధి నిర్వహణలో మాత్రం పూర్తి స్థాయిలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలకు ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిఫాం ఉచితంగా అందిస్తోంది. వీటిని ధరిస్తే ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులని గుర్తు పట్టే వీలుంటుంది. ప్రతి సంవత్సరం రూ.1500 యూనిఫాంకు, ప్రతి నెలా క్లీనింగ్‌కు రూ.100 ప్రకారం చెల్లిస్తున్నారు. అయితే అనేక వార్డుల్లో ఉద్యోగులు ఖద్దరు దుస్తులు వేసుకొని రావడం, 50 శాతంకు పైగా ఉద్యోగులు యూనిఫాంను ధరించకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఏ వ్యక్తి ఆసుపత్రి ఉద్యోగి, ఏ వ్యక్తి కాదో గుర్తు పట్టలేని పరిస్థితి. ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ సమస్య జఠిలంగా మారింది. వేళలు పాటించాలని ఓ వైపు జిల్లా కలెక్టర్ పదే పదే చెబుతున్న ఉద్యోగులు తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేలకు రావాలంటూ ప్రభుత్వాసుపత్రి టెలిఫోన్ ఎక్ఛేంజిలో బయో మెట్రిక్ విధానం(కంప్యూటర్ థంబ్ ఇంప్రిషన్) ద్వారా విధులకు హాజరవుతున్నట్లు నమోదు చేయాలి.

అలాంటిది ఎంత మంది ఉద్యోగులు నమోదు చేస్తున్నారనేది ప్రశ్నార్థకం.  24 గంటల ల్యాబ్ ఎదుటనున్న షెడ్డుల్లో పనిచేసే టెక్నికల్ సిబ్బంది ఏనాడూ బయో మెట్రిక్ నమోదు చేసుకున్న దాఖలాల్లేవు. వీరిలో ఒక ఉద్యోగి వేతనం అక్షరాల రూ.48 వేలు. ఉదయం అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ బయటి వ్యాపారాల్లో తలమునకలవుతున్నారు. ఆయన తరఫున వెయ్యి రూపాయల వేతనంతో బినామీ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు.  ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓల్లో ఎక్కువ స్థాయిలో బినామీ ఉద్యోగులు పని చేస్తుండటం బహిరంగ రహస్యం. పాలనను గాడిన పెట్టాల్సిన పర్యవేక్షణ అధికారులు ఆ దిశగా కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమవుతోంది. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, స్వీపర్, స్ట్రెచర్ బాయ్.. ఇలా ఏ ఒక్కరూ యూనిఫాం వేసుకోకపోయినా ఉన్నతాధికారులు ప్రశ్నించకపోవడం ఆసుపత్రిలో పాలన ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement