
సాక్షి, తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా 20 ఏళ్లకు పైగా సేవలు అందించిన పెద్దింటి శ్రీనివాసమూర్తి గతేడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. అయితే తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు ప్విమ్స్ ఆస్పత్రిలో చేరగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబసభ్యులే సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment