అందరి దృష్టి జెడ్పీ మీటింగ్‌పైనే!
- ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామే టార్గెట్
- అధికారుల్లో పెరుగుతున్న టెన్షన్
చిత్తూరు (టౌన్): జిల్లా కేంద్రంలో ఈనెల 31న జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జిల్లాలో 37 మంది జెడ్పీటీసీ సభ్యు లు అధికారపార్టీకి చెందిన వారు కాగా 27 మంది వైఎ స్‌ఆర్ సీపీకి చెందిన సభ్యులు ఉన్నారు. వీరితో పాటు ఒక ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు. అధికార పార్ట్టీకి చెందిన జెడ్పీటీసీసభ్యులంతా దాదాపుగా కొత్తవారు కాగా వైఎస్‌ఆర్ సీపీలో కొందరు రెండోసారి ఎన్నికైన వారున్నారు.
కొత్తపాలకవర్గం నిర్వహించేతొలి సమావేశంలో ఎవరు ఏమడుగుతారో, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు, ఇంతకూ సమావేశం సామరస్యం గా జరుగుతుందా? లేక ఉద్రిక్త పరిస్థితుల్లో నడుస్తుం దా, ఒకవేళ అదే జరిగితే వారిని ఎదుర్కొనేదెలా? అని జెడ్పీ పాలకవర్గ సభ్యులు ఆలోచిస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల్లో పరిపాలనపై అవగాహన వుం డేవారెవరు, వారు దేనిపై ఎక్కువగా మాట్లాడే అవకా శం వుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కొవాలనే కోణం లో సంబంధిత అధికారులతో పాలకవర్గసభ్యులు ఇప్పటికే చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఎవరు ఏమడి గినా సంబంధిత శాఖల అధికారులనే సమాధానం చెప్పమని సభకు అధ్యక్షత వహించే చైర్‌పర్సన్‌తో చెప్పించాలని, అప్పటికీ ప్రతిపక్ష సభ్యుల్లో ఆం దోళన తగ్గకపోతే రేపటి సమావేశంలో మీరడిగిన ప్రశ్నలకు సమాధానం రాతపూర్వకంగా ఇప్పించే చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్‌తో చెప్పిస్తే సరిపోతుం దనే నిర్ణయించుకున్నారని తెలిసింది.
దృష్టంతా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామిపైనే
జెడ్పీ సమావేశానికి జిల్లాలోని వైఎస్‌ఆర్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అధికార పార్టీకి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో ఒకరు సీఎం, ఇంకొకరు మంత్రి. వీరిద్దరూ రావడం కుదర దు. ఇకపోతే మిగిలింది నలుగురే. వారిలో ఒకరు త ప్ప మిగిలినవారంతా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారే.
కాగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడిగా జెడ్పీపై ప ట్టున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జి ల్లా కన్వీనర్ నారాయణస్వామి సభకు అడ్డుపడతారనే గుబులు జెడ్పీ అధికారులతోపాటు పాలకవర్గాన్ని పట్టి పీడిస్తుంది. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మం ది ఉన్నా వారిలో చెవిరెడ్డి, నారాయణస్వామిపైనే అం దరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
సమస్యంతా స్థాయి సంఘాల ఏర్పాటులోనే
జెడ్పీ పరిధిలో నిర్వహించే సర్వసభ్య సమావేశాలతో పాటు స్థాయి సంఘ సమావేశాలు కూడా జరగాల్సివుంది. అయితే సర్వ సభ్యసమావేశం, స్థాయి సంఘ సమావేశాలు వేర్వేరు తేదీల్లో జరుగుతాయి. జెడ్పీకి పా లకవర్గం ఏర్పడిన తర్వాత జరిగే తొలి సమావేశంలోనే స్థాయి సంఘాల సభ్యులను నియమించాల్సి ఉంది. ఒకటి, ఏడు సంఘాలు కీలకం కావడంతో వాటికి చైర్‌పర్సన్ ఆ సంఘాల చైర్‌పర్సన్‌గా నియమితులు కావ డం ఆనవాయితీ.
మిగిలిన వాటికి కొన్నింటికి వైస్‌చైర్మన్‌ను, మరికొన్నింటికి అధికారపార్టీ జెడ్పీటీసీ సభ్యుల ను చైర్మన్లుగా నియమిస్తారు. అయితే ఈ స్థాయి సం ఘాల్లో అధికారపార్టీకి చెందిన వారే కాకుండా ప్రతి పక్షానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను కూడా చైర్మన్లతో పాటు సభ్యులుగా నియమించాల్సివుంది. వీటిలో ప్రా ధాన్యత లేని సంఘాలకు ప్రతిపక్షానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులను నియమిస్తే దానిపై సభలో దుమారం లే చే పరిస్థితి లేక పోలేదు. ఇవన్నీ లేకుండా చేయాలంటే ఎలా వ్యవహించాలనే దిశగా అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నారు.