జన్మనక్షత్రం తెలియదా?నో ప్రాబ్లమ్!మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (జులై 13 నుంచి19 వరకు) మీ రాశి ఫలితాలు-డా‘‘ మైలవరపు శ్రీనివాసరావుజ్యోతిష్య పండితులు
మేషం(మార్చి 21 –ఏప్రిల్ 19)
చేస్తున్న వృత్తిలో ఇష్టం లేనితనం క్రమ క్రమంగా పెరుగుతూ వెళ్లే అవకాశముంది.ఏది మనకీ మన కుటుంబానికీ భోజనాన్ని అందిస్తోందో ఆ వృత్తిపట్ల విముఖతను చూపడం సరికాదు.ఒకవేళ అనుకున్నంత లాభాలు రాని పక్షంలో ఎక్కడ లోపమో గమనించుకుని ఆ నిర్వహణ లోపాన్ని సరిదిద్దుకోండి తప్ప వృత్తిని కాలదన్నుకోకండి.కొంతకాలంపాటు అనుభవాన్ని గడించిన ఈ వృత్తి నైపుణ్యాన్నీ మెళకువలనీ తోసిరాజంటూ మరో వృత్తిని చేపట్టదలిస్తే దాంట్లో ఒక స్థాయికి వచ్చేసరికి ఎంతో కాలం వృథా అవుతుంది.అన్నిటికీ మించి దీన్ని మానేద్దామనే దృక్పథం మంచిది కాదు. దొర్లుతున్న బంతిలా నిలకడతనం ఉండదు. గమనించుకోండి.ఉద్యోగస్థులకి అసంతృప్తి ఉండే అవకాశముంది. ఏదో ఉద్యోగాన్ని చేస్తున్నాను. జీతం బాగానే వస్తోంది. అయినా ఉద్యోగ సంతృప్తి లేదంటూ అదేదో ఓ గొప్పగా మాట్లాడుతుంటారు.
ఏ తీరు నీచ/ హేయ ఆనందకరమైన ఉద్యోగం వచ్చినా చాలనే వ్యక్తులు ఎందరున్నారో గమనించుకుని ఉద్యోగమంటూ ఉన్న మీరెంత అదృష్టవంతులో పరిశీలించుకోండి.కుటుంబం నడవడానిక్కావలసిన జీతం ధర్మబద్ధంగా వస్తే చాలు– అంతే అనుకోండి.బంధుమిత్రులు మిమ్మల్నెంతో ఉదారబుద్ధితో గౌరవిస్తుంటే చూసీ చూడనట్లు ఉదాసీనతను చూపడం ఏమాత్రమూ సరికాదు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు.
లౌకిక పరిహారం: వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అన్నాన్ని పెడుతున్నాయని గమనించుకోండి.
అలౌకిక పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం మంచిది.
వృషభం (ఏప్రిల్ 20 –మే 20)
మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఎత్తులు పల్లాలు గుంటలు గొప్పులు.. ఇలా ఎన్నెన్ని వస్తాయో దానికి సిద్ధపడి కదా ప్రయాణం చేస్తున్నాం. అదే తీరుగా జీవన క్రమంలో నిష్కారణంగా నిందలు ఒక్కోసారి తీవ్రమైన అపనిందలు, అపకీర్తిని మూటకట్టించే గట్టి నిందలు మీకు రావచ్చు– అష్టమశని కారణంగా. రావలసిన అపనింద ఎలాగూ వచ్చేసింది కాబట్టి దానిలో నిజమెంతో ఆలోచించుకుని, మీదే ధర్మమైనవేళ– నింద అనేది కేవలం అసూయా పగా ద్వేషం అనేవాటివల్లే కలిగిందని మీకు అర్థమైన పక్షంలో నిర్భయంగా నలుగురిలో నిలబెట్టి ఆ చాడీని పుట్టించిన వ్యక్తిని నిలదీయండి. అతడే గనుక మీకు లభ్యపడకపోతే ఆ గృహిణికి వివరించి చెప్పండి పరిస్థితిని. ప్రస్తుత దశలో ఇలా చేసినందువల్ల ఇబ్బంది మీకు కలుగదు. నింద తొలగిపోవడమే కాక, వీనితో జాగ్రత్తగా ఉండాలనే భావం కలుగుతుంది అందరికీ.
దురదృష్టవశాత్తూ కుటుంబంలో అనైకమత్య పరిస్థితులు గోచరించవచ్చు. ఐకమత్యం దెబ్బతినడానికి కారణం నోటిమాటే కాబట్టి అదుపు చేసుకుని మాట్లాడండి. కుటుంబపు పెద్ద మీరే గనక అయినట్లయితే మీరే తగ్గి ఓ మాటని పడి ఉండండి తప్పదు. కారణం మీరు కుటుంబాన్ని ఓ కట్టగా కట్టి రక్షించాల్సిన వ్యక్తి కాబట్టి. అంతే తప్ప అసమర్థునిగా ఉండవలసిందని కాదు దీనర్థం.
ఏదో ప్రయోజనం ఉండబోతోందనుకుంటూ దూరభార ప్రయాణాలని చేస్తారు కాని అది వ్యర్థ ప్రయాణం మాత్రమే కావచ్చు. ఈ సారి ఆలోచించుకుని మాత్రమే వెళ్లండి. ఒకరికి తోడు కోసమే వెళ్లడం, దూరదూర బాంధవ్యాన్ని కలుపుకుందామనే దృష్టితో అంతంత ప్రయాణాలని శారీరక శ్రమతో చేయడం అవసరం కాదేమో!
లౌకిక పరిహారం: నిందని వేస్తే నిరూపించగల ధర్మం ఉండటే విడవకండి. నిరూపించండి.
అలౌకిక పరిహారం: దుర్గాదేవీ స్తుతి మంచిది గ్రహణ కాలంలో.
మిథునం(మే 21 –జూన్ 20)
తమదే తప్పు– అని తెలిసిన సహోద్యోగులూ కింది ఉద్యోగులూ వాద వివాదాలకి రారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు.
ఆధ్యాత్మిక దృష్టి బాగా పెరిగే అవకాశముంది. మంచిదే. అయితే దేంట్లోనూ అతి అనేది పనికిరాదు. కాబట్టి ఓ ఆర్థిక ప్రణాళిక వేసుకుని పుణ్యక్షేత్ర దర్శనాలూ దానధర్మాలూ చేయండి తప్ప రుణాన్ని తీసుకుని మరీ ఈ కార్యక్రమాలని నిర్వహించడం వల్ల కుటుంబంలో ఇబ్బందులు అనైకమత్యం ఏర్పడవచ్చు.
లోపల అనారోగ్యం పెరుగుతోందనే యథార్థాన్ని గమనించి తగిన ఔషధ సేవని చేయడం మంచిది తప్ప ఉదాసీన దృష్టితో ఉండకండి. గోటితో పోగొట్టుకోండి. గొడ్డలి దాకా పరిస్థితిని పెంచుకోకండి.
ఉద్యోగాన్ని మారదలచడమనేది మీకు ఉద్యోగంలో సంతృప్తి లేదనే భావంతో– కలగవచ్చు. అయితే నూతనోద్యోగ ప్రాప్తి ప్రస్తుతానికి లేని కారణంగా కొనసాగి తీరాల్సిందే ప్రస్తుత ఉద్యోగంలో. ఇక్కడ ఉన్నంతసేపూ నిరాసక్తితో పని చేయడం కంటే ఆ ఉన్నంతకాలమూ ఉత్సాహంతో ఉండడం మంచిది కదా! తప్పదు. ఉండాల్సిందే!
వాద వివాదాలకి ఎప్పుడూ ఇష్టపడని మీరు మీ స్వేచ్ఛ, మీ పట్టుదలా కారణంగా తప్పక వాద వివాదాల్లోకి దిగుతారు. అయితే ఆ వాదం మరింత పెరిగి న్యాయస్థానం దాకా వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తపడి తీరాలి. ఇటువైపు వారూ అటువైపు వారూ రెచ్చగొట్టి మొత్తానికి మిమ్మల్ని న్యాయస్థానం వరకూ సాగనంపి చేతులు దులుపుకుంటారు. మీ వైపుకి ఏ ఒక్కరూ సాక్ష్యానికి రారని గమనించి వాదాన్ని తగ్గించుకోండి.
లౌకిక పరిహారాలు: వాద వివాదాలు వద్దు. నోటిని అదుపులో ఉంచుకోక తప్పదు.
అలౌకిక పరిహారం: గ్రహణ సమయంలో ఆంజనేయ స్తుతిని చేస్తూ ఉండండి.
కర్కాటకం(జూన్ 21 –జూలై 22)
మీకున్న రంగంలో కీర్తీ ప్రతిష్ఠా సభలూ సన్మానాలూ అనుకుంటూ మీరు సాగిపోతూండడం మంచిదే అయినా, మీకున్న కుటుంబాన్ని ఈ ధోరణిలో పట్టించుకోలేని తనం కారణంగా కుటుంబంలో వ్యతిరేకత పెరిగిపోతూ ఉండచ్చు. భోజనంలో ఎలా అన్ని పదార్థాలనీ ఎలా ఒక పరిమితితో స్వీకరిస్తూ ఆ మొత్తాన్ని భోజనంగా అనుకుంటూ తింటామో అలాగే కుటుంబపు పెద్దగా అన్నిటికీ అందరికీ సమతౌల్యాన్ని మీరు అందిస్తూ ఉండాల్సిందే! గమనించుకోండి.
ఒక సందర్భంలో మీకు అన్యాయం జరిగిందని అనిపిస్తే వేగంగా దూసుకునిపోయే స్వభావం మీది. అయితే అంతలోనే ఎందుకీ వివాదం? అనే దృక్పథంతో ఆగిపోయి మౌనంగా చింతిస్తూ ఉండే స్వభావం కూడా మీది. నిజానికి ఈ దృక్పథమే మంచిది ఈ యుగంలో విశేషించి ప్రస్తుతపు మీ దశలో కూడా. అలాగే ఉన్నట్లయితే సమస్య పరిష్కారమయ్యేదెలా అని దిగులు పడకండి. ఎదుటివారికి వినే అవకాశమున్న సమయాన్ని గమనించుకుని మీదైన మాటలతో వివరించి చెప్పే సమయం వస్తుంది. పరిష్కరించుకోగలుగుతారు. ఆ సమర్థతా అదృష్టం ఉన్న దశ మీది.
వాహన విషయంలో భద్రతని పాటించండి. వీలైనంత వరకూ వీధి భోజనాలని మాని చల్లబడినా రుచి కొంత తగ్గిందనిపించినా ఇంటి భోజనమే శ్రేయస్కరమనే మాటని మర్చిపోకండి. దానికి కారణం అనారోగ్యం లోపల ఉంది కాబట్టి అది ప్రస్తుతానికి సామాన్య స్థితిలో ఉంది. భయపడకండి. నివారించుకునే ప్రయత్నాల్లో ఇంటి భోజనం ఒక ఔషధమని భావించి తగున్యాయం చేసుకోండి.
అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం లేదు. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చే అవసరం కూడా తప్పిపోయింది. సంతోషించండి.
లౌకిక పరిహారం: ఇంటి భోజనమనేది రాబోయే అనారోగ్యానికి ప్రథమ ఔషధం.
అలౌకిక పరిహారం: గ్రహణ సమయంలో వైద్యుడైన శివుణ్ణి స్తుతిస్తూ ఉండండి.
సింహం(జూలై 23 –ఆగస్ట్ 22)
న్యాయస్థానంలో అన్ని అభియోగాలూ పూర్తిగా వీగిపోయాయి కదా! అనే ఆనందంతో పాటు ఒకే ఒక్కటి ఇంకి మిగిలి ఉంది అనే చిన్న చింత మీకు ఉంటుంది. ఈ సమస్యని వీలైతే న్యాయస్థానపు ప్రాంగణం బయట సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవడం మంచిది. తాడుని మరింత గట్టిగా లాగద్దు.
చేస్తున్న వృత్తి ఉద్యోగాల విషయంలో తగిన సమయపాలన తప్పనిసరి అని గుర్తించండి.
తోటి ఉద్యోగుల నిఘా నేత్రాలు మీ మీద లేరనే భ్రమలో ఉండకండి. ఒక వ్యక్తి ఎదుగుదల అనేది అతరులకి కిట్టని పని. కంటకంగా ఉంటుంది కూడా. అయినా తీసుకునే జీతానికో, వస్తున్న ఆదాయానికో తగినంత న్యాయాన్ని చేకూర్చడం మీ విధివ, కర్తవ్యం కాదా? పరిశీలించుకోండి.
తల్లిద్రండులు వృద్ధులై ఉంటే తేలికపాటి ఆరోగ్య పరీక్షలని చేయించండి. అది అవసరం. ఉన్నతాధికారులతో వాగ్వివాదాలు వద్దు. మీదే నిజంగా పొరపాటయ్యుంటే అంగీకరించడానికి వెనుకాడకండి. తేలికగా బయటపడిపోగలుగుతారు.
ఋణం ఇచ్చిన ఋణదాతల నుండి ఒత్తిడి మరింతగా ఉండకపోవచ్చు గాని ఒత్తిడి మాత్రం రావచ్చు. ఒకసారంటూ అడగడం ప్రారంభమయిందంటే మరి కొన్నాళ్లకి ఒకటికి రెండు మార్లు అడిగే స్థితి, ఆ మీదట ఒత్తిడిగా మారి తీరుతుంది.
ముందుకి ముందే జాగ్రత్తపడి, ఫలానా నాటి వరకూ తీర్చలేనని వాళ్లు అంగీకరించేలా మాట్లాడుకోవడం మంచిది. ఆలసించకండి.
లౌకిక పరిష్కారం: పెద్దలకి తేలికపాటి ఆరోగ్య పరీక్షలను చేయించండి.
అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో గణపతిని ఆరాధించంది.
కన్య(ఆగస్ట్ 23 –సెప్టెంబర్ 22)
అర్ధాష్టమ (4వ ఇంట) స్థానంలో శని ఉన్న కారణంగా ఏవేవో తెలియని చికాకులు కలిగిస్తూనే ఉంటాడు. శని ఎప్పుడూ హాని చేసే స్వభావం కలవాడు కాడు కాబట్టి ఇటు పక్క లౌకికంగా ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉండడం, అటు పక్క శనికి భయపడుతూ ఆరాధించడం అనే రెంటి వల్ల అనిష్టాన్ని తొలగించుకోగలుగుతారు.
ఆరోగ్యంలోమార్పులు కనిపిస్తూ ఉండచ్చు. కొద్దిగా జాగ్రత్త పడండి. లోహ వ్యాపారులకి – బంగారం, వెండి, ఇత్తడి, రాగి కంచు... వ్యాపారస్థులకి మంచి ఆదాయం వస్తుంది. అయితే వచ్చిన లాభం మొత్తాన్ని మళ్లీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేయడం ప్రస్తుతం సరికాదు.
కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అవి ఫలించకపోయినంత మాత్రాన నిరాశ పొందకండి. ప్రయత్నిస్తూనే ఉండడమనేది మీరు చేస్తున్నంతసేపూ మీది దోషం కాబోదు. అనుకూలించే సమయం మరి కొంత కాలంలో ఉంది.
పోటీ పరీక్షలకి సిద్ధం కండి. మీ పిల్లలని పట్టించుకుంటూ ఉండండి. కుటుంబంతో ఎక్కువసేపు గడుపుతూ ఉండాలనే ఆలోచనలతో ఉండండి. చాల సమస్యలు పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో సమస్యలన్నీ కేవలం పరస్పర సంబంధాలని తగినంతగా కలిగి ఉండకపోవడం – ప్రయత్నం కూడా చేయకపోవడము.
క్రయవిక్రయాల్లో మంచి లాభం మీకు వస్తోందనే యదార్థాన్ని గమనించి మిత్రులు, ఆర్తులు, బందువులు... ఎవరైనా ధనసహాయానికి ప్రార్థిస్తే ఆలోచించి తగినంత సహాయపడడం మంచిదే. సోదరులతో ఎక్కువ సౌభ్రాత్ర సహకారం ఉంటుంది.
లౌకిక పరిష్కారం: శని వల్ల ఏ కష్టం దుఃఖం లభిస్తుందోనని భయపడకండి.
రంఅలౌకిక పరిహా: లలితా సహస్ర నామాలని గ్రహణ కాలంలో పఠించండి.
తుల(సెప్టెంబర్ 23 –అక్టోబర్ 22)
మంచి అనుకూల కాలం నడుస్తోంది కాబట్టి ఉద్యోగంలో పదవీ ఉన్నతీ దాంతోపాటు వేతనం కూడా పెరగడమే మరింత అదృష్టం కలిసొస్తే మీకు అనుకూల ప్రదేశానికి బదిలీ కూడా అయ్యే అవకాశం ఉండచ్చు.
మీ సంతానం ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడికే మీ ఉద్యోగం దాదాపుగా ఉండే కారణంగా ఒకే ఇంట్లో ఉండచ్చు. ఇంతవరకూ పడిన మానసిక శ్రమ తొలగిపోతూ ఉండే కాలం ఇది.
అయితే అవసరమయిన ఆలోచనల భారంతో జ్ఞాపకశక్తి క్రమ క్రమంగా తగ్గుదలకి వెళ్లచ్చు. ఈ సందర్భంలో నిరుత్సాహ పరులతో జీవితంలో ఏవో కారణాలతో ఓడిపోయిన వారితో సాహచర్యాన్ని పెంచుకోకుండా ఉండండి.
చలి బాగా ఉన్న ప్రాంతంలో చిన్న చలిమంట వద్ద ఉండడం మంచిది. అస్తమానం జ్ఞాపకశక్తిని కోల్పోతున్నాననే ధ్యాసతోనే ఉంటే ఇప్పుడున్న జ్ఞాపకశక్తి కూడా పోయే అవకాశముంది కాబట్టి ఆ దిశగా ఆలోచించకండి.
ఎంత ఆర్థికంగా ముందంజంలో ఉన్నప్పటికీ దానికి దాదాపుగా సరిపోయినంత ఆర్థిక వ్యయం కూడా ఉండే కారణంగా మానసికంగా ఆర్థికపరమైన ఉత్సాహంతో ఉండకపోవచ్చు. పోనీ ఆ ద్రవ్యం అవసరమైన తీరులో ప్రయోజనాత్మకమైన పద్ధతిలో వ్యయం ఔతోందా? అని ఆలోచిస్తే న్యాయస్థానానికీ ఇతరమైన ఖర్చులకీ రాకపోకలకీ... ఇలా ఔతుండే కారణంగా చాలా మనోవ్యధగా ఉంటుంది. అనుక్షణం పై అధికారుల ఒత్తిడితో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని చేస్తూ సంపాదించే దాన్ని ఇలా వ్యయం చేయాల్సి వస్తోందా? అనే నిరుత్సాహంతో ఉంటారు. ఇక కొద్ది కాలమే ఇలా ఉంటారు.
లౌకిక పరిహారం: నిరుత్సాహపరులూ, భయాన్ని నూరిపోసే వారికీ దూరంగా ఉండండి.
అలౌకిక పరిహారం: గ్రహణ కాలంలో ఎంత వీలైతే అంతగా శనిని ఆరాధించండి.
వృశ్చికం(అక్టోబర్ 23 – నవంబర్ 21)
నిలకడలేని తీరులో ఉద్యోగ వ్యాపారాల్లో రోజుకొక చోట చొప్పున విశేషంగా ప్రయాణాలు తప్పనిసరి అవుతుంటాయి. అన్ని ప్రయాణాలూ సౌకర్యాలూ ఆనంద దాయకంగానూ పెద్దలతో పరిచయాలని పెంపొందించేవిగానూ అనిపిస్తే, మరికొన్ని ప్రయాణాలు చెప్పలేనంత శారీరక శ్రమకి గురి చేసేవి అవుతూ ఉంటాయి.
శారీరక శ్రమ నిద్రవల్లనో పదిమందితో గడపడం వల్లనో వినోద విహారాల వల్లనో తొలగచ్చు గాని, మనోవ్యధ మాత్రం 2013 మధ్య నుండీ ఉన్న సందర్భంగా తొలగే పరిస్థితి కనిపించక చక్కటి శయ్యమీద పడుకున్నా ఎగుడు దిగుడుల మీద పడుకున్న రీతిగా అనిపించక తప్పదు. అయినా భరించక తప్పదు. కొంతకాలం మాత్రమే.
సంతానం విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. ఈ మనోవ్యధ కారణంగా ఆ సంతోషాన్ని అనుభవించకలేకపోవచ్చు. మరికొందరి విషయంలోనైతే సంతానాన్ని చూపించకుండా శత్రువర్గం (భార్య/భర్త) వాళ్లు వ్యవహరిస్తుండడం అదనపు మనోవ్యధకి కారణం ఔతూ ఉండచ్చు.
మాటల్లో కాఠిన్యం ఏమాత్రమూ సరికాదు. వీలయినంత వరకూ ఆచితూచి మాట్లాడటం, వాగ్దానాలని చేయకపోవడం మంచిది. అడ్డుండి ఎవరికో సొమ్మునిప్పించడం, హామీలనియ్యడం, సాక్షి సంతకాలని చేయడం వంటివి పూర్తిగా ప్రమాదకరం. మీరు ఆ స్థాయి జాగ్రత్తలతోనే వ్యవహరిస్తున్నారనేది యథార్థమే అయినా మరోమారు సూచించడం దీని లక్ష్యం.
మీరు ఏ నిర్ణయాన్ని చేయబోతున్నారనే విషయాన్ని దానికి సంబంధించిన వ్యక్తికి మాత్రమే తెలియజేస్తూ గోప్యతని పాటించినట్లయితే అది కార్య సాఫల్యానికి తోడ్పడుతుంది. పదిమందికీ చాటుకోవడం సరికాదు.
లౌకిక పరిహారం: గోప్యతని పాటించండి. ఆచితూచి మాట్లాడండి.
అలౌకిక పరిహారం: శనిస్తోత్రాన్ని కనీసం 108 మార్లు గ్రహణ కాలంలో పఠించండి.
ధనుస్సు(నవంబర్ 22 – డిసెంబర్ 21)
ఎదురు చూసిన ద్రవ్యం తప్పక అనుకోకుండా ఎక్కువ మొత్తంలో లభించే అవకాశముంది. ఈ ఆనందాన్ని పంచుకోవడంలో భాగంగా ఓ తెలియరాని వ్యక్తికి తెలియజేసినందువల్ల – వారి నుండి అప్పుకి సంబంధించిన అభ్యర్థన వచ్చి – మానసిక సంక్షోభం ఏర్పడవచ్చు.
దిగులు పడకండి. వారికి రుణాన్ని ఇయ్యనే ఇయ్యరు. అయితే మైత్రి మాత్రం దెబ్బ తినవచ్చు. నష్టం లేదు. ప్రయాణాల్లో వస్తు జాగ్రత్త తప్పనిసరి. అతి ముఖ్యమైనది ధనం కాదు.
ముఖ్యమైన పత్రాలు ఏమున్నాయో వాటి విషయంలో జాగ్రత్తని పాటించక తప్పదు. తల్లివైపు బంధువుల నుండి పూర్తి సహాయం సహకారం లభిస్తూండడంతో చెప్పలేనంత మాన సిక ధైర్యం లభిస్తూ ఉంటుంది. ఆ బాంధవ్యాన్ని నిలుపుకోండి.
గోచారస్థితి శుభాశుభమిశ్రమంగానే ఉన్న కారణంగా చేపట్టిన ప్రతి పనీ లాభదాయకంగా ముగుస్తుందని భావించకండి.
చేయవలసిన ప్రతి ప్రయత్నానికీ తగిన దానికి మించిన జాగ్రతని పాటిస్తూనే ఉండాలని భావించండి. వ్యవసాయదారులకి అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు.
కొనుగోలు చేసిన విత్తనాలూ యంత్రపరికరాలూ అలాగే మరికొన్ని వస్తువులూ.. పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే అదనులో చేసుకోవలసిన పనులకి కొన్ని ఆటంకాలు ఏర్పడి చేయవలసినంత స్థాయిలో పొలం పనులని చేసుకోలేకపోవచ్చు. దాంతో మరొకరికి కౌలుకీయాలనే అభిప్రాయానికి బలంగా రావచ్చు. ఆలోచించుకోండి.
లౌకిక పరిహారం: వస్తువుల జాగ్రత్త ప్రయాణాల్లో అవసరం.
అలౌకిక పరిహారం: వినాయక ధ్యానాన్ని గ్రహణకాలంలో చేయండి.
మకరం(డిసెంబర్ 22 – జనవరి 19)
వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేక ఎక్కువ వ్యాపారం సాగకున్నా అదే విధంగా వృత్తి ఉద్యోగాల్లో కూడ మానసిక శ్లేషమన్పించినా దైవ ప్రార్థన అవసరమనే మాట నిజమే కాని, నిరంతరం దైవచింతనలోనే గడపాలనే ‘అతి’ మంచిది కాదు. అలాటి పరిస్థితే గనుక ఉంటే తగ్గించుకోవాలి ఆ ఆలోచనని.
మానవ ప్రయత్నానికి దైవకృప అవసరం తప్ప కేవలం దైవప్రార్ధన అనేది ఫలితాన్నీయలేదు. కష్టకాలమని తెలిసినప్పటికీ కూడ దాన ధర్మాలని చేస్తూ ఉంటారు. అదెంతవరకూ సమంజసమో యోచించుకోండి. దేనికైనా ఓ ప్రణాళిక అనేది అవసరమని గుర్తించండి. తెలివితేటలతో దూర–భార ప్రయాణాలని మానుకుంటారు. శారీరక మానసిక ఉత్సాహం ఈ కారణంగా లభిస్తుంది.
విదేశాల్లో ఉన్న సంతానం నుండి రావాలసిందిగా ఆహ్వానం అదినా ప్రస్తుత పరిస్థితిలో కదిలి వెళ్లడం, చేతి నిండుగా పనికోసం వెదుక్కుంటున్న ఈ పరిస్థితిల్లో అక్కడికి వెళ్లి ఖాళీ చేతితో (పనిలేకుండా ఉండడం) కాలాన్ని గడపడం అంత సరికాదు. వినోదం విహారమనేది పనులు ముగించుకున్నాక చేయాల్సిన పనులు తప్ప పనివేళలో వాటి మీద దృష్టి ఉండడం సరికాదు.
చుట్టుపక్కలవారితో తగుమాత్రపు పరిచయమే మంచిది తప్ప విశేష పరిచయాలు కాదు. అనుకోని ఖర్చులైతే ఏమీ రావుగాని ఉన్నా సొమ్ము మాత్రం కొంత ఎక్కువస్థాయిలోనే వ్యయమౌతూ ఆర్థికమైన లోటుని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉంటుంది.
రుణమిచ్చే వారున్నారు కదా అని వెంటనే రుణాన్ని తీసుకున్నట్లయితే ప్రస్తుతం మీ దశ ప్రకారం సొమ్ముకి తగ్గ వ్యయం తప్పనిసరి అయిపోతుంది. జాగ్రత!
లౌకిక పరిహారం: రుణం తీసుకోవద్దు.
అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో దుర్గాస్తుతి మంచిది.
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వ్యాపారంలో పోటీతత్త్వం ఉంటుంది. దాన్లో మీరు ముందంజలో ఉంటారు. పిల్లల వివాహాలక్కావలసిన బంగారు, వెండి, పట్టు బట్టలు వంటి వాటిని చక్కగా సమీకరించుకుంటూ ఉంటారు.
అహంకారం దర్పం గర్వం మాత్రం సరికాదు. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారనే ఆనందంతో మీ బంధుగణంలో ఎవరినో ఒకర్ని చదివించాలనే ఆలోచనతో ఆర్థిక సహాయాన్ని చేస్తారు.
అలాగే ఆప్తుల్లో ఒకరికి వైద్య వ్యయపరంగా సహాయం చేస్తారు. తీర్థయాత్ర దృష్టి ఉంటుంది గాని కుటుంబపరమైన బాధ్యతా నిర్వహణలో అది ఈ వారంలో సాధ్యపడకపోవచ్చు.
కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో మాటామాటకి దిగే స్థితి గోచరిస్తోంది. తద్ద్వారా కొన్ని అతిముఖ్య విషయాలు పదిమందికీ తెలిసే అవకాశమేర్పడుతోంది. గట్టిగా ప్రయత్నించి కుటుంబరహస్య గోప్యతని పాటించని పక్షంలో సంపాదించిన ద్రవ్యానికి సంబంధించిన లెక్కలనీ వివరాలనీ చెప్పుకోవలసిన పరిస్థితి రావచ్చు. ఎవరినీ తూలనాడకండి. గౌరవించండి.
అనుకూలంగా మాట్లాడండి తప్ప సూచనలనీ సలహాలనీ అవతలివారు వింటున్నారు గదాని చెప్తూ వెళ్లిపోకండి.
అదే తీరుగా మీ సంతానాన్ని కూడ ఎవరెవరితో అతి సమీపంగా వాళ్లు మసులుతున్నారో ఓ కంట కనిపెడుతూ వాళ్ల దృక్పథం – ప్రవర్తనల్లో ఏ మార్పు ఎవరి నుండి దిగుమతి అవుతుందో గ్రహించుకోండి. వాద వివాదాలకి దూరంగా ఉండండి.
లౌకిక పరిహారం: కుటుంబరహస్య గోప్యత అవసరం.
అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమం.
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సంతానం గాని ఇంకా విద్యాభ్యాస దశలోనే గాని ఉంటే ఒకరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందిని కల్గిస్తూ ఉండచ్చు. చదువు పట్ల నిరాసక్తిని కలిగి ఉండచ్చు. ఎప్పుడైనా వ్యక్తి మానసికంగా ఉత్సాహంగా లేక నిరాసక్తతతో ఉంటే దానిక్కారణం ఆ వ్యక్తి లోపల పెరగడం కోసం ప్రయత్నిస్తున్న అనారోగ్యమే అనేది నిస్సంశయమైన విషయం. కాబట్టి తేలికపాటి వైద్యపరీక్షలని చేయించి విశ్వసనీయ వైద్యునితో – అవసరమని అన్పించిన పక్షంలో చికిత్స చేయించండి.
ప్రధాన విద్యకంటె వేరైన క్రీడలు చిత్ర లేఖనం మొక్కల్ని పెంచడం.. వంటి వాటిలో ఆసక్తిని చూపిస్తున్న ధోరణి మెల్లగా సంతానానికి ఒంటపట్టచ్చు. జాగ్రత! ఇలాటి విద్యేతర కార్యక్రమాలకి ఉత్సాహాన్ని కల్గిస్తూ ఉండేవాళ్లు తమ పిల్లల్ని కూడ అలాగే ప్రోత్సహిస్తూ ఉన్నారా? అని గమనిస్తే మీరు ఏం చేయాల్సి ఉందో అర్ధమౌతుంది. భార్యాభర్తల అనుబంధమనేది మరింతగా వృద్ధి పొందాలంటే గొంతుని తగ్గించి మాట్లాడుకోవడం, సంసార విషయాలు మాత్రమే కాకుండా లోకాభిరామాయణాన్ని సంభాషించుకోవడం మంచిదనే విషయం మీకు అర్థమౌతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్థులై ఉండి ఎవరి ఉద్యోగ కష్టాన్ని మరొకరికి చెప్పుకోవడం మాత్రమే చేసుకుంటుంటే పిల్లలు ఏకాకులుగా అవుతూ మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునే అంశం వాళ్లకంటూ లేక చదువు పట్ల నిరాసక్తులౌతారు.
అదే మీ కుటుంబంలో ఉండచ్చేమో! పుట్టింటి వారి నుండి రావలసిన తోటల పంటల ఆదాయం ఒక్కసారికి ఆలస్యమైతే వెంటనే ప్రతిస్పందించేస్తూ తొందరపాటుతనాన్ని చూపద్దు. సంయమనం పాటించండి.
లౌకిక పరిహారం: పిల్లలు విద్యేతతరమైన వాటిలో ఆసక్తిని చూపకుండా జాగ్రతపడండి.
అలౌకిక పరిహారం: గ్రహణకాలంలో సరస్వతీ ప్రార్థనని చేయండి.
Comments
Please login to add a commentAdd a comment