ప్రమాద స్థలంలో బూరుగు వెంకటేశ్వర్లు మృతదేహం
సత్తుపల్లిరూరల్ : అతి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇది జరిగింది. రేజర్ల గ్రామస్తులు బూరుగు వెంకటేశ్వర్లు(30), జక్కుల భానుచందర్(28) కలిసి ద్విచక్ర వాహనంపై షాపు వద్దకు వెళ్తున్నారు. వేంసూరు వైపు నుంచి సత్తుపల్లికి వేగంగా వస్తున్న కారు (ఏపీ 16 బిఎన్ 2299), ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఆ కారు అదే వేగంతో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని మూడు పల్టీలు కొట్టింది.
ద్విచక్ర వాహనంపై ఉన్న బూరుగు వెంకటేశ్వర్లు, జక్కుల భానుచందర్ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే పరారయ్యారు. ప్రమాద స్థలాన్ని సత్తుపల్లి సీఐ ఎం.వెంకటనర్సయ్య పరిశీలించారు. ప్రధాన రహదారిపై మృతుల కుటుంబీకుల రోదన, ప్రమాద దృశ్యం.. చూపరుల మనసును కలిచివేసింది. బూరుగు వెంకటేశ్వర్లుకు భార్య రజిని (గర్భిణి), కుమార్తె ఉన్నారు. జక్కుల భానుచందర్ అవివాహితుడు.
కలిసి తిరిగారు.. కలిసి వెళ్లారు
ఈ ప్రమాదంలో మృతిచెందిన బూరుగు వెంకటేశ్వర్లు, జక్కుల భానుచందర్‌ది ఒకే గ్రామం. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒంగోలు కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నట్టు తెలిసింది. ధర్మాజీగూడెంలో లెక్చర్‌గా భానుచందర్ పనిచేస్తున్నాడు. సోమవారం శ్రీరామ నవమి సందర్భంగా వీరిద్దరూ స్వగ్రామానికి చేరుకున్నారు. చివరికి ఇలా మృత్యువులోనూ కలిసే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment