సాక్షి, హైదరాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని, నగర వీధులు కొత్త వాహనాలతో కళకళలాడబోతున్నాయి. ఈ దసరాకు రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య పెరుగబోతుందని ఆటోమొబైల్ డీలర్స్, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ అధికారిక అంచనాల్లో తెలిసింది. గత ఎనిమిది రోజుల విక్రయాలను చూసుకుంటే కనీసం 1.5 లక్షల కొత్త వాహనాలు ఈ దసరాకు రోడ్డుపై చక్కర్లు కొట్టబోతున్నట్టు వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆకర్షణీయమైన డిస్కౌంట్లు తక్కువగా ఉన్నప్పటికీ, టూ-వీలర్ కేటగిరీలో విక్రయాలు 10 శాతం పైకి ఎగిసినట్టు అధికారిక డేటా పేర్కొంది. టూ-వీలర్స్ కేటగిరీలో గతేడాది ఎంత మొత్తంలో అమ్ముడుపోయాయో, ఈ ఏడాది అంతే మొత్తంలో విక్రయమైనట్టు తెలిసింది. నగరంలో ఉన్న ఐదు రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు సుమారు లక్ష మేర నమోదైనట్టు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
దుర్గాష్టమి రోజున కొత్త వాహనాలను కొనుగోలు చేయడం హిందూవులకు సెంటిమెంట్ అని, ఆయుధ పూజ, వాహన పూజ కోసం కొత్త వాహనాల కొనుగోళ్లు చేపడతారని ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ పేర్కొంది. గురువారం దుర్గాష్టమి కావడంతో, ఈ విక్రయాలు మరింత పెరిగాయని, కచ్చితమైన గణాంకాలను త్వరలోనే విడుచేయనున్నట్టు తెలిపింది. ఈ దసరాకి వర్తకులకు మంచి విక్రయాలు నమోదయ్యాయని, జీఎస్టీ అమలు వినియోగదారులకు లబ్ది చేకూరినట్టు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ లీడర్ పి.టి చౌదరి(రిటైర్డ్) చెప్పారు. వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు ఈ విధంగానే విక్రయాలు నమోదవుతాయని పేర్కొన్నారు. కొన్ని మోడల్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో, చాలా మంది డీలర్స్ ఆఫర్లు ప్రకటించలేదు. కార్ల విషయానికి వస్తే, రూ.40వేల వరకు నగదు ప్రయోజనాలను వినియోగదారులు పొందారు.