
ముంబై: అంతర్జాతీయ అగ్రశ్రేణి వంద బ్రాండ్లలో టాటాలకు చోటు దక్కింది. లండన్‌కు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన గ్లోబల్ టాప్–100లో టాటా బ్రాండ్ 86వ స్థానంలో నిలిచింది. టాటా బ్రాండ్ విలువ ఈ ఏడాది 37 శాతం పెరిగి 1,950 కోట్ల డాలర్లకు ఎగియడంతో టాటా బ్రాండ్ ఈ ఘనతను సాధించిందని బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ పేర్కొంది.
గత ఏడాది 104వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ సారి వంద లోపు జాబితాలోకి వచ్చిందని, భారత్ నుంచి ఈ జాబితాలో చోటు సాధించిన ఏకైక కంపెనీ కూడా ఇదేనని వివరించింది. టీసీఎస్ మెరుగైన పనితీరుతో టాటా బ్రాండ్ విలువ భారీగా పెరిగిందని పేర్కొంది. కాగా ఈ గుర్తింపు తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు.