బడ్జెట్ ‘సమ్’గతులు | 2014-15 budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ ‘సమ్’గతులు

Published Tue, Feb 18 2014 1:41 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

బడ్జెట్ ‘సమ్’గతులు - Sakshi

బడ్జెట్ ‘సమ్’గతులు

 ఎస్‌టీటీ  లక్ష్యం పెంపు
 ఎస్‌టీటీను 2004లో ప్రవేశపెట్టారు. క్యాపిటల్ మార్కెట్లో ఈక్విటీల కొనుగోలు లేదా అమ్మకపు లావాదేవీపై విధించే పన్ను ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ వసూలు లక్ష్యం రూ. 6,000 కోట్లు. ఈ ఏడాది(2013-14) లక్ష్యం రూ. 6,720 కోట్లుకాగా, తాజాగా రూ. 5,497 కోట్లకు తగ్గించారు. దీంతో పోలిస్తే వచ్చే ఏడాది లక్ష్యం 9% అధికం. గడిచిన ఏడాది(2012-13)లో ఈ వసూళ్లు రూ. 4,997 కోట్లు.
 
  ఏడీఆర్, జీడీఆర్ నిబంధనలు మారుస్తాం...
 ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత విస్తరించే దిశలో విదేశీ లిస్టెడ్ సెక్యూరిటీల నిబంధనలను మొత్తంగా సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా దేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్‌ల నిబంధనలను హేతుబద్ధీకరించనున్నట్లు  చిదంబరం పేర్కొన్నారు. వీటితోపాటు దేశీయంగా కార్పొరేట్ బాండ్లు, కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విభాగాల వైపు రిటైల్, సంపన్న వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా  కంపెనీలు తక్కువ ఖర్చులో దీర్ఘకాలిక నిధులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కుతుందన్నారు. ఇక విదేశీ కరెన్సీ రిస్క్‌లను త ట్టుకునేందుకు వీలుగా కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్‌ను పటిష్టపరచనున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలు పూర్తిస్థాయిలో హెడ్జింగ్‌ను చేపట్టే వీలుంటుందన్నారు.
 
 డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా...
 ఈ మార్చిలోగా హిందుస్తాన్ జింక్, బాల్కోలలో ప్రభుత్వానికి గల వాటాలను విక్రయించడం సాధ్యపడదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి మాయారామ్ చెప్పారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వేతర కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లను మాత్రమే సమీకరించగలమని భావిస్తున్నట్లు ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్‌లో పేర్కొన్నారు. తొలుత వీటి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 14,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.  మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాక ఆర్థిక మంత్రి చిదంబరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాయారామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్‌లో 29.54%, బాల్కోలో 49% చొప్పున వాటా ఉంది. కాగా, ఈ ఏడాది(2014-15)కి  డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సగానికిపైగా తగ్గిస్తూ రూ. 16,027 కోట్లకు ఆర్థిక శాఖ పరిమితం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం ద్వారాతొలుత రూ. 36,925 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే.
 
 మన స్టాక్ మార్కెట్లు మెరుగే
 ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగైన పనితీరునే కనపరిచాయని ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్  సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించారు. ఇందుకు ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలు దోహదం చేశాయని చెప్పారు.
 
 క్యాపిటల్ మార్కెట్ సంస్కరణలు
  మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అదనపు అధికారాలిచ్చే బిల్లుకు ఆమోదం లభించనప్పటికీ క్యాపిటల్ మార్కెట్ సంస్కరణలకు సంబంధించి పలు చర్యలను చేపట్టినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం తాత్కాలిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బీమా చట్టాల సవరణ, సెక్యూరిటీల చట్ట సవరణ వంటి అత్యున్నత బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోవడంతో నిరుత్సాహానికి లోనయ్యామని వ్యాఖ్యానించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సంబంధించి సెబీతో చర్చల ద్వారా వివిధ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. వివిధ కేట గిరీలకింద విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను(ఎఫ్‌పీఐలు) గుర్తించడం, మనీ లాండరింగ్‌ను నిరోధించే చట్టానికి(పీఎంఎల్‌ఏ) సవరణలు చేయడం వంటి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు.  
 
 ఎగుమతులు ఆశావహం
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) ఎగుమతులు ఆశావహంగా ఉంటాయన్న అంచనాలను ఆర్థికమంత్రి పీ చిదంబరం వెలిబుచ్చారు. ఈ పరిమాణం 6.3 శాతం వృద్ధితో 326 బిలియన్ డాలర్లుగా నమోదవుతాయని భావిస్తున్నట్లు చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2013-14లో భారత్ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2012-13)తో పోల్చితే 1.8 శాతం తగ్గి, 300.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా దిగుమతులు తగ్గుతున్నట్లు చిదంబరం పేర్కొన్నారు. క్యాడ్ కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై ఆంక్షలు దీనికి ప్రధాన కారణమని కూడా ఆయన వివరించారు.
 
 మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి
 మౌలిక రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి చిదంబరం తాత్కాలిక బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు. తద్వారా రూ. 6,60,000 కోట్ల విలువైన ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు దారిచూపినట్లు చెప్పారు. వివిధ కారణాలతో పలు ప్రాజెక్ట్‌లు నిలిచిపోయిన పరిస్థితుల్లో పెట్టుబడులపై క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా 296 ప్రాజెక్ట్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల అంచనా విలువ రూ. 6,60,000 కోట్లుగా పేర్కొన్నారు.
 
 బడ్జెట్ షాక్ ఇచ్చింది: జెమ్స్ అండ్ జ్యూవెలరీ
 బడ్జెట్ పట్ల ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బడ్జెట్ తమను షాక్‌కు గురి చేసిందని జీజేఎఫ్ చైర్మన్ హరేష్ సోని వ్యాఖ్యానించారు. పుత్తడిపై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతమున్న సుంకాల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగిపోతోందని పేర్కొన్నారు. పుత్తడి దిగుమతి ఆంక్షల కారణంగా లక్షలాది స్వర్ణకారులు, చేతి నిపుణులకు పని లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పెద్ద, మధ్య తరహా కార్లు, ఎస్‌యూవీ వంటి విలాస వస్తువులపై  ఎక్సైజ్ సుంకం తగ్గించిన ప్రభుత్వం 40 లక్షల మందికి ఉపాధినిస్తున్న దేశీయ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పరిశ్రమపై విచక్షణ చూపిందని విమర్శించారు. క్యాడ్ పెరిగి పోవడానికి పుత్తడి ఒక్కటే కారణం కాదని, ప్రజలు బంగారాన్ని ఉత్తమమైన సామాజిక ఆస్తిగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement