జోరుగా 3జీ డేటా వినియోగం
న్యూఢిల్లీ: భారత్‌లో 3జీ సర్వీసుల వినియోగం భారీగా పెరిగిపోతోంది. గతేడాది 3జీ సర్వీసుల వాడకం రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని, అంతర్జాతీయ సగటును మించి పోయిందని నోకియా సొల్యుషన్స్ అండ్ నెట్‌వర్క్స్(ఎన్‌ఎస్‌ఎన్) నివేదిక వెల్లడించింది. అయితే అగ్రశ్రేణి 50 నగరాల్లో 3జీ కవరేజ్ ఇంకా విస్తరించాల్సి ఉందంటున్న
ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...,
2012 డిసెంబర్ చివరికల్లా 8 పెటబైట్స్‌గా ఉన్న 3జీ డేటా వినియోగం గత ఏడాది డిసెంబర్ చివరికల్లా 21 పెటబైట్స్‌కు చేరింది. ఒక పెటాబైట్ 1,024 టెర్రాబైట్స్‌కు సమానం.
2జీ, 3జీ సర్వీసుల కారణంగా ఉత్పన్నమైన డేటా ట్రాఫిక్ గతేడాది 87 శాతం వృద్ధి చెందింది.
2013లో భారత వినియోగదారుల నెలసరి సగటు 3జీ డేటా వినియోగం 532 మెగా బైట్లుగా ఉంది. 2012లో ఈ వినియోగం 434 మెగాబైట్లు.
3జీ వినియోగదారుల సగటు డేటా వినియోగం 2జీ వినియోగదారుల సగటు డేటా వినియోగం(146 ఎంబీ)తో పోల్చితే మూడు రెట్లకు పైగానే ఉంది.
2012లో మొబైల్ డేటాలో 33 శాతంగా ఉన్న 3జీ డేటా వినియోగం 2013లో 43 శాతానికి పెరిగింది.
3జీ వినియోగదారుల సంఖ్య కూడా బాగానే పెరుగుతోంది. 2012 చివరినాటికి 2 కోట్లుగా ఉన్న 3జీ వినియోగదారుల సంఖ్య గతేడాది చివరి నాటికి 3 కోట్లకు పెరిగింది.
దేశవ్యాప్తంగా 80 వేల మొబైల్ టవర్లు 3జీ సిగ్నల్స్‌ను ట్రాన్స్‌మిట్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30-40 శాతం కవరేజ్ లభిస్తోంది. ఈ కవరేజ్ 70-80 శాతానికి పెరిగితే 3జీ వినియోగంలో భారీ వృద్ధి ఉంటుంది. కాగా దేశవ్యాప్తంగా 4,50,000 టవర్లు 2జీ సిగ్నళ్లందజేస్తున్నాయి.
4జీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, 3జీ సర్వీసుల హవా 2-3 ఏళ్లపాటు కొనసాగుతుంది.