మా సర్వీసులు అడ్డుకునే యత్నం
♦ జీఎస్‌ఎం ఆపరేటర్లపై రిలయన్స్ జియో వ్యాఖ్యలు
♦ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లేఖ
న్యూఢిల్లీ : టెలికం సేవల్ని పరీక్షించే విషయమై రిలయన్స్ జియో, జీఎస్‌ఎం ఆపరేటర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. పరీక్షల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా రిలయన్స్ జియో పూర్తి స్థాయి టెలికం సేవలు అందిస్తోందంటూ జీఎస్‌ఎం ఆపరేటర్లు చేసిన ఆరోపణలపై జియో తీవ్రంగా స్పందించింది. తమ టెలికం సర్వీసులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. జీఎస్‌ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ వాదనలను ఖండిస్తూ బుధవారం 8 పేజీల లేఖను విడుదల చేసింది. సీవోఏఐ ఆరోపణలు ద్వేషపూరితమైనవని, నిరాధారమైనవని, అవాస్తవాలతో కూడుకున్నవని పేర్కొంది. ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్న ఆపరేటర్ల స్వార్థ ప్రయోజనాలను కాపాడేవిగా ఇవి ఉన్నాయని వ్యాఖ్యానించింది. పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా ఇతర టెలికం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను అక్రమంగా అడ్డుకుంటున్నారని ఆర్‌జియో సీనియర్ అధికారి ఆరోపించారు.
టెస్ట్ యూజర్లు ఇబ్బందిపడుతున్నారు...
ఏడాది కాలంలో 10 కోట్ల పైగా యూజర్లకు చేరాలని నిర్దేశించుకున్నామని, దీనికి తగ్గ స్థాయిలో ఇంటర్‌కనెక్టివిటీ సదుపాయం కల్పించేందుకు ఇతర టెలికం ఆపరేటర్లు కూడా తమ టవర్ల సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని ఆర్‌జియో వివరించింది. ఇందుకోసం ఆయా ఆపరేటర్లకు కొన్ని చోట్ల తమ సొంత ఖర్చుతో పరికరాలను కూడా అందిస్తున్నట్లు తెలియజేసింది. ‘‘కానీ సదరు ఆపరేటర్లు పాయింట్ ఆఫ్ ఇంటర్‌కనెక్షన్లను (పీవోఐ) మెరుగుపర్చుకోవడం పక్కన పెట్టి అసంబద్ధమైన కారణాలతో పీవోఐ మెరుగుదలను అడ్డుకుంటున్నారు.
ఇంటర్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల పీవోఐల వద్ద రద్దీ ఎక్కువై.. కాల్స్ కలవటం లేదు. దీంతో ప్రస్తుతం మాకున్న 15 లక్షల మంది టెస్ట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాల్ వైఫల్యాల ఉదంతాలు ఏకంగా 65 శాతం మేర ఉంటున్నాయి. ఈ స్థాయిలో కాల్ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్న పరిస్థితుల్లో మేం వాణిజ్యపరమైన సేవలు ప్రారంభించడం తెలివైన పని కాదు. ఒకవేళ ప్రారంభిస్తే ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసే ఆర్‌జియో యూజర్లకు, అలాగే వేరే టెలికం సంస్థల నుంచి మా నెట్‌వర్క్‌కు కాల్స్ చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని ఆర్‌జియో వివరించింది.
ఇవన్నీ అడ్డుకునే యత్నాలే...
‘సీవోఏఐ గత కొద్ది రోజులుగా నియంత్రణ సంస్థ నుంచి మేం అనుచిత ప్రయోజనాలు పొందుతున్నామన్నట్లుగా ఆరోపణలు చేస్తోంది. అదే ఆరోపణలతో పత్రికా ప్రకటనలిస్తోంది. మా టెస్ట్ ట్రయల్స్‌కు వ్యతిరేకంగా లేఖలు రాయడం కూడా చేసింది. ఇవన్నీ కూడా మా లాంటి కొత్త సంస్థను మార్కెట్లో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలే. ట్రయల్స్‌లో పాల్గొంటున్న యూజర్ల నుంచి మేం ఎలాంటి చార్జీలూ వసూలు చేయడం లేదు. కాబట్టి పోటీ సంస్థలను దెబ్బతీసేలా మా టారిఫ్‌లు ఉంటున్నాయన్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. నెట్‌వర్క్ ఇంటర్‌కనెక్షన్ చార్జీల అంశాన్ని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సమీక్షిస్తోంది. దానికి ముడిపెట్టేలా సీవోఏఐ కావాలనే వివాదం రేపుతోంది’’ అని జియో వివరించింది.
వివాదమిదీ..
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో త్వరలో భారీ ఎత్తున టెలికం సర్వీసులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే, ఇందులో భాగంగా టెస్ట్ కనెక్షన్లు ఇస్తున్న ఆర్‌జియో ఆ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయి సర్వీసులు అందించేస్తోందంటూ టెలికం శాఖకు సీవోఏఐ ఆగస్టు 8న లేఖ రాసింది. దాదాపు 15 లక్షలకు పైగా యూజర్లకిచ్చిన అన్ని కనెక్షన్లు ఆర్‌జియో తక్షణం ఆపేసేలా ఆదేశించాలని కోరింది. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర సంస్థలు సీవోఏఐలో భాగంగా ఉన్నాయి. దీనిపైనే తాజాగా ఆర్‌జియో స్పందించింది.