
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు ప్రస్తుత ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్ డాలర్లు. వాణిజ్యశాఖ ఈ మేరకు తాజా గణాంకాలను విడుదల చేసింది.వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఆభరణాల పరిశ్రమ డిమాండ్ దీనికి నేపథ్యం. పసిడి దిగుమతులు తగ్గించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.
క్యాడ్‌పై ఆందోళన..
భారత్ ప్రధానంగా దిగుమతి చేసుకునే రెండు కమోడిటీల్లో ఒకటి క్రూడ్ కాగా, రెండవది పసిడి. అయితే క్రూడ్ దిగుమతి తప్పనిసరి. అప్రధానమైన పసిడి దిగుమతులు పెరగడం ఇప్పుడు ఆర్థికవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులు వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)పై ప్రభావం చూపుతాయన్నది వారి ఆందోళనలకు కారణం. ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు.
ఇక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్‌లోటు. దేశంపై ఇది రుణ భారం పెంపునకు, తద్వారా దేశీయ మారకపు విలువ కోతకు దారితీస్తుంది. 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వాణిజ్యలోటు 76.66 బిలియన్ డాలర్ల నుంచి 94.32 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక క్యాడ్ 2018–19 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 2.4 శాతంగా నమోదయ్యింది.