
బ్యాంకులకు రేపటి నుంచి మళ్లీ వరుస సెలవులు రాబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు రేపటి(శనివారం) నుంచి మంగళవారం వరకు మూత పడబోతున్నాయి. ఏప్రిల్ 28 నాలుగో శనివారం కావడంతో యథావిథిగా బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. ఏప్రిల్ 29 ఆదివారం, సోమవారం బుద్ధ పూర్ణిమ, మంగళవారం కార్మిక దినంతో బ్యాంకులు ఈ సెలవులను పాటిస్తున్నాయి. అయితే సోమవారం, మంగళవారం రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి బ్యాంకులు మూసివేయరు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ సెలవులను బ్యాంకులు పాటిస్తాయి.
బుద్ధ పూర్ణిమ(సోమవారం) రోజు మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలో బ్యాంకులు మూసివేయనున్నారు. లేబర్ డే(మంగళవారం) రోజు కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో, గోవాల్లో సెలవులను పాటించనున్నాయి. ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూత పడినా ఏటీఎంలు మాత్రం ఎప్పడికప్పుడూ నింపుతూనే ఉంటామని ఓ బ్యాంకర్ చెప్పారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి కార్యకలాపాలను కూడా యథావిథిగా కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవలే నగదు కొరతతో కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ సమస్య అంతగా మెరుగు పడలేదు.