న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు అతిపెద్ద పట్టణాల్లో 2017 ఆఖరుకు 4.4 లక్షల నివాస భవనాలు అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. వీటిలో ఒక్క ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే అమ్ముడు కాని 1.5 లక్షల ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక సంఖ్యలో మిగిలిపోవడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని విశ్లేషించింది. జేఎల్‌ఎల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కత్తా ఈ జాబితాలో ఉన్నాయి.
ఢిల్లీలో నికరంగా 1,50,654 యూనిట్లు అమ్మకం కాకుండా ఉండిపోగా, చెన్నైలో విక్రయం కాకుండా మిగిలిపోయిన వాటిలో ఎక్కువ యూనిట్లు నిర్మాణం పూర్తి చేసుకున్నవేనని జేఎల్‌ఎల్ తెలిపింది. కోల్‌కత్తాలో అతి తక్కువగా 26,000 యూనిట్లే మిగిలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ విక్రయం కాని ఇళ్లు, ఫ్లాట్లు 28,000. ముంబైలో 86,000, బెంగళూరులో 70,000, పుణేలో 36,000 మిగిలిపోయాయి. రెరా, డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల నిర్మాణ కార్యకలాపాలు మందగించడంతోపాటు డిమాండ్ కూడా తగ్గినట్టు జేఎల్‌ఎల్ పేర్కొంది. ధరలు స్థిరంగా ఉండడంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో విక్రయాలు క్రమంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment