రిలయన్స్ జియో (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఆధార్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ... ప్రైవేట్ సంస్థలు, టెలికాం సర్వీసుల కంపెనీలు ఆధార్ డేటాను సేకరించడం తగదని, ఆయా కంపెనీలకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి కాదని రెండో రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సెక్షన్ 33(2)ను, సెక్షన్ 57, 47లోని కొన్ని భాగాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ తీర్పు టెలికాం మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియోకు చెంపపెట్టులా మారింది. జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన సమయంలో, సులభతరమైన ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌తో క్షణాల్లో జియో సిమ్‌లను కస్టమర్లకు ఆఫర్ చేసింది. దీంతో కస్టమర్లకు జియో సిమ్ కార్డులు ఎంతో సులభంగా లభించాయి. ఫలితంగా యూజర్ల సంఖ్య కూడా జియోకు భారీగా పెరిగింది. అలా అప్పుడు మొదలైన జియో సంచలనం, ఇప్పటికీ మార్కెట్లో కొనసాగుతూనే ఉంది. కొత్త కస్టమర్లను వెంటవెంటనే యాడ్ చేసుకోవడంలో జియో ఎల్లప్పుడు ముందంజలో ఉంటూ వచ్చింది.
కానీ ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, జియోకు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగానే పడిపోనుంది. వచ్చే నెలల్లో జియో కస్టమర్ల అడిక్షన్ బాగా తగ్గిపోనుందని విదేశీ బ్రోకరేజ్ విశ్లేషకుడు చెప్పారు. సిమ్ కార్డు కొనుక్కోవాలంటే, వెరిఫికేషన్ ప్రక్రియకు ఇక కస్టమర్లు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుందని, దీంతో అటు కస్టమర్లకు ఖర్చు కూడా పెరగనుందని తెలుస్తోంది. దీంతో కస్టమర్లు జియోను ఎంపిక చేసుకునే ఆసక్తిని కోల్పోతారని విశ్లేషకులు చెబుతున్నారు. జియోను విస్తరించడం కూడా ఆ కంపెనీకి క్లిష్టతరంగానే మారనుందని అంటున్నారు. కేవలం జియోకు మాత్రమే కాక, ఇతర కంపెనీలు పేటీఎం, మొబిక్విక్ లాంటి డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు, ఇతర థర్డ్ పార్టీ కంపెనీలకు కూడా సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదేనన్నారు. సుప్రీంకోర్టు పూర్తిగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్‌ను రద్దు చేయడంతో, ఆయా కంపెనీలకు కూడా ప్రతికూలంగా మారనుందని పేర్కొంటున్నారు విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment