డిసెంబర్ త్రైమాసికం క్యాడ్ 1.3%
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్- డిసెంబర్) 1.3 శాతంగా నమోదయ్యింది. 2014-15లో ఈ రేటు 1.5%. ఇటీవలి నెలల్లో దిగుమతులు తగ్గి వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) తక్కువగా నమోదవుతుండడం కరెంట్ అకౌంట్ లోటు తగ్గడానికి ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారక నిధులు, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకపు నిధుల మధ్య నికర వ్యత్యాసమే(ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) కరెంట్ అకౌంట్ లోటు. ఈ పరిమాణాన్ని స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. డిసెంబర్‌లో ఈ విలువ 7.1 బిలియన్ డాలర్లని (జీడీపీలో 1.3%) గణాంకాలు వెల్లడించాయి. 2014-15 ఇదే కాలంలో ఈ విలువ 7.7 బిలియన్ డాలర్లు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జీడీపీలో ఇది 1.7%.కాగా ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కరెంట్ అకౌంట్ 1.7% నుంచి 1.4 శాతానికి తగ్గింది.