మళ్లీ ఎయిర్‌లైన్స్ చౌక ఆఫర్లు | After Spicejet Re 1 offer, fare war stampede begins | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎయిర్‌లైన్స్ చౌక ఆఫర్లు

Published Fri, Apr 4 2014 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

మళ్లీ ఎయిర్‌లైన్స్ చౌక ఆఫర్లు - Sakshi

మళ్లీ ఎయిర్‌లైన్స్ చౌక ఆఫర్లు

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు మరోసారి చౌక చార్జీల ఆఫర్లు ప్రకటించాయి. ఈసారి పోరులో తాజాగా ఎయిరిండియా, గోఎయిర్ కూడా బరిలోకి దిగాయి. ‘మాన్‌సూన్ బొనాంజా’ పేరిట ఎయిరిండియా గురువారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం దేశీయంగా 40 రూట్లలో రూ. 1,499కే (పన్నులు అదనం) టికెట్లను అందిస్తున్నట్లు తెలిపింది. శనివారం దాకా బుకింగ్‌కి అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వివరించాయి. మరోవైపు, చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో కూడా పలు రూట్లలో డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

దీని కింద వన్ వే టికెట్‌కి రూ. 1,389 నుంచి చార్జీలు ప్రారంభమవుతాయని ట్రావెల్ ఏజెంట్లకు పంపిన లేఖలో ఇండిగో పేర్కొంది. ఇందుకోసం 90 రోజులు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇవి తమ నెట్‌వర్క్‌లోని డెరైక్ట్ ఫ్లయిట్స్‌కు మాత్రమే వర్తిస్తాయని వివరించింది. అయితే, ఎప్పట్నుంచి బుక్ చేసుకోవచ్చన్న విషయాన్ని వెల్లడించని ఇండిగో.. ఈ ఆఫర్ కింద కొన్ని సీట్లను మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 30లోగా ప్రయాణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొంది.

  మరోవైపు, ఇండిగో నెట్‌వర్క్‌లో ఢిల్లీ-లక్నో మధ్య వన్ వే ప్రయాణానికి అత్యంత చౌక చార్జీ రూ. 1,389గా ఉందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. అదే ఢిల్లీ-ముంబై టికెట్ చార్జీ రూ. 2,400 పైచిలుకు ఉంటుందన్నారు. ప్యాసింజర్ సర్వీస్ ఫీజు, యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు,  పన్నులన్నింటితో ప్రయాణికులు మరింత ఎక్కువే కట్టాల్సి ఉంటుందని చెప్పారు. అటు, గోఎయిర్ సైతం 48 గంటల సేల్ ప్రకటించింది. 90 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై 30-40% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.  జూలై- సెప్టెంబర్ మధ్య ప్రయాణాలకు ఈ చార్జీలు వర్తిస్తాయి.
 విమానయాన సంస్థలు ఇలా చార్జీల పోరుకు దిగడం ఈ ఏడాది ఇది నాలుగోసారి.

 మంగళవారం స్పైస్‌జెట్ రూపాయి ఆఫర్‌ని ప్రకటించడంతో సంస్థ వెబ్‌సైట్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. పోటీ సంస్థలను దెబ్బతీయడంతో పాటు ప్రయాణికులను మభ్యపెట్టే విధంగా ఉన్న ఈ ఆఫర్‌ని తక్షణమే ఆపేయాలంటూ విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. దీనిపై స్పైస్‌జెట్ బుధవారం వివరణనిచ్చింది. డీజీసీఏ ఆదేశాల మేరకు ఆ ఆఫర్‌ని తొలగించామని పేర్కొంది. ఢిల్లీ-ముంబై వంటి రూట్లలో ఇప్పటికీ ఇంధన సర్‌చార్జీలన్నీ కలుపుకుని అత్యంత చౌకగా రూ. 1,499కి టికెట్ అందిస్తున్నామని, పన్నులు కూడా కలిపితే మొత్తం చార్జీ రూ. 2,436 అవుతుందని స్పైస్‌జెట్ తెలిపింది. ప్రయాణికులు తక్కువ చార్జీల ప్రయోజనం పొందేందుకు టికెట్లను ముందుగా బుక్ చేసుకునేందుకు ఇటువంటి ఆఫర్లు ఉపయోగపడగలవని యాత్రాడాట్‌కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement