వేలానికి ముస్తాబైన మాల్యా విమానం
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు చెందిన అత్యంత ఖరీదైన విమానాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. భారత్ లో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ఆస్తులను ఇప్పటికే బ్యాంకులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ శాఖ కూడా అదే దారిలో పయనిస్తోంది.
సుమారు166 కోట్ల రూపాయలతో నవంబర్ 2006 కొనుగోలు చేసిన స్పెషల్ జెట్ కు మరిన్ని కోట్లు వెచ్చించి హంగులు అమర్చుకున్నాడు మాల్యా. ముఖ్యంగా బార్, భోజనాల గది, బెడ్ రూమ్, వంటగదివాష్ రూం లాంటి విలాసవంతమైన సౌకర్యాలను పొందుపరిచాడు. వజ్రాలు పొదిగిన బాలాజీ చిత్రాపటం, మరో నాలుగు పికాసో చిత్రాలు సహా ఇతర ఖరీదైన కళాఖండాలు లోపల అమర్చాడు. అయితే పన్నులు చెల్లించడంలో విఫలం కావడంతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎయిర్ ఇండియా ఎయిర్ భారతదేశం ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఎయిర్ బస్ ఎ 319 ని ముస్తాబు చేశారు. చాలా మరమ్మతులు, హంగులు అమర్చిన అనంతరం ఈ మే 12, 13 తేదీల్లో ప్రభుత్వ నిర్వహణలోని ఎంఎస్టిసి లిమిటెడ్ దీన్ని వేలానికి పెట్టనున్నారు. అయితే ఎయిర్ బస్ లోని మాల్యా పిల్లల ఫోటోలతో పాటు, ఖరీదైన చిత్రాలను మినహాయించి వేలం వేయనుంది.
మాల్యా నుంచి తనకు రావలసిన రూ.370 కోట్లకు పైగా పన్ను బకాయిలను రాబట్టేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ తాజాగా మాల్యా ప్రైవేట్ విమానాన్ని అమ్మకానికి పెట్టింది. మే 12-13 తేదీల మధ్య ఈ -133 సిజె విమానాన్ని వేలం వేయనుంది. ఇంజనీరింగ్ కంపెనీ సిబ్బంది ఇప్పటికే విమానం లోపలా, బయటా శుభ్రం చేసిందనీ, 22 సీట్లు ఎయిర్బస్ 319 ని అందంగా తీర్చిదిద్దారని విమానాశ్రయం అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా దాదాపు 18 నెలల క్రితం ఆదాయపన్ను శాఖ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ప్రైవేట్ జెట్ సర్వీసులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టును రద్దు చేసినట్టుగా విదేశాంగ శాఖ ప్రకటన, అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో మాల్యా వ్యవహారం నానాటికీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది.