ప్రైవేటీకరణ దిశగా ఎయిరిండియా!
⇒ నీతి ఆయోగ్ సిఫారసుల నేపథ్యంలో త్వరలో కేంద్రం నిర్ణయం
⇒ వ్యూహాత్మక వాటా విక్రయ యోచన
న్యూఢిల్లీ: నష్టాలతో కుదేలయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించే అంశంపై కేంద్ర క్యాబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రజలు చెల్లించే పన్నులను ఎయిరిండియాను పునర్‌వ్యవస్థీకరించేందుకు వినియోగించే బదులు.. వైద్యం, విద్య మొదలైన రంగాలకు ఉపయోగించుకోవచ్చంటూ నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన దరిమిలా పౌర విమానయాన శాఖ ఈ దిశగా యోచిస్తోంది. దాదాపు రూ. 50,000 కోట్ల మేర రుణభారం పేరుకుపోయిన ఎయిరిండియా మార్కెట్ వాటా మాత్రం సుమారు 14 శాతం స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే వ్యాఖ్యానించారు.
ఆర్థిక పరిస్థితులు ’అస్సలు బాగాలేని’ ఎయిరిండియాను ప్రైవేటీకరించాలా వద్దా అన్న దానిపై క్యాబినెట్ త్వరలో తగు నిర్ణయం తీసుకోగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలేమీ వెల్లడి కాకపోయినప్పటికీ.. వాటాల వ్యూహాత్మక విక్రయం లేదా ఏకమొత్తంగా పెట్టుబడుల పూర్తి ఉపసంహరణ రూపంలోనైనా ప్రైవేటీకరణ ఉండొచ్చని తెలుస్తోంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ని విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే ఉంది. అయితే, 2015–16లో ఇంధన ధరలు తగ్గడం, ప్రయాణికుల సంఖ్య పెరగడం తదితర కారణాలతో రూ. 105 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది.
ప్రైవేట్ సంస్థలకే ప్రయోజనం: సీఐటీయూ
ప్రైవేట్ విమానయాన సంస్థలకు లబ్ధి చేకూర్చాలనే దురుద్దేశంతోనే జాతి సంపద లాంటి ఎయిరిండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘం సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) ఆరోపించింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనమైన పదేళ్ల తర్వాత ఎయిరిండియా మళ్లీ నిర్వహణ లాభాలు ఆర్జించిన తరుణంలో ప్రైవేటీకరణ యోచన సరికాదని పేర్కొంది.