
సాక్షి, న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా తన పనితీరును నిలకడగా మెరుగుపరుచుకుని రెట్టింపు లాభాలను సాధించింది. రూ .298.03 కోట్లనిర్వహణ లాభాలను సాధించిందని ప్రభుత‍్వం ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.105కోట్లుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే నికర నష్టాలు మరింత ఎగిసి రూ.5765కోట్లుగా నమోదయ్యాయి. 2015-16 నాటికి నికర నష్టం రు. 3,836.77 కోట్లు.
ఎయిర్ ఇండియా భారతదేశంలో మొత్తం ఆర్థిక, కార్యాచరణ పనితీరును మెరుగుపరుచుకుంటోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా గురువారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. టర్నరౌండ్ ప్రణాళికలో భాగంగా, ఎయిర్ ఇండియా మార్గాలను హేతుబద్ధీకరించడం , విస్తరణకోసం వివిధ చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. ఎయిర్ ఇండియా స్పెషల్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఎఐఎస్ఎంఎం) బిడ్డింగ్ ఆహ్వాన ప్రతిపాదనల డ్రాఫ్ట్ ను ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా ఎయిర్ ఇండియా మ్యూజియం ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment