ఎయిర్ ఇండియాకు రూ.105కోట్ల నిర్వహణ లాభం...
పదేళ్లలో ఇదే తొలిసారి
• ఇంధనం ధరలు తగ్గడం, ప్రయాణికుల
సంఖ్య పెరగడమే ప్రధాన కారణాలు
న్యూఢిల్లీ: పదేళ్లలో ప్రధమంగా ఎయిర్ ఇండియాకు లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయి ర్ ఇండియా సంస్థ రూ.105 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాకు రూ.2,636 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. ఇంధనం ధరలు తక్కువగా ఉండడం, ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల 2007(ఈ ఏడాదే ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్ ఇండియా లో విలీనమైంది) నుంచి చూస్తే, దశాబ్దంలో తొలిసారిగా ఎయిర్ ఇండియా లాభాలను కళ్లజూసింది.
7% పెరిగిన ప్రయాణిల సంఖ్య: గత ఆర్థిక సంవత్సరంలో ఇంధన వ్యయాలు 24% తగ్గడం వల్ల ఎయిర్ ఇండియా లాభాల బాట పట్టింది. ఇంధనం ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అందించిందని, ఫలితంగా టికెట్ల ధరలు 8% వరకూ తగ్గాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 7 శాతం వృద్ధితో 1.8 కోట్లకు పెరిగింది.