తిరుపతికి ఎయిరిండియా విమానం
విశాఖ నుంచి విజయవాడ మీదుగా నేటి నుంచి సేవలు
గన్నవరం: ఎయిరిండియా సంస్థ విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి శనివారం నుంచి కొత్త సర్వీస్‌ను ప్రారంభించనుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ సర్వీస్‌ను నడుపుతారు. బుధవారం ఒక్కరోజు మాత్రం విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు దీన్ని నడుపుతారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్‌కు నడుపుతున్న విమాన సర్వీస్‌ను రద్దు చేసి... దాని స్థానంలో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిరిండియా తెలియజేసింది. నాలుగు నెలలుగా తిరుపతికి ఈ విమాన సర్వీస్‌లు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులకు కొత్త సర్వీస్ రాకతో కష్టాలు తీరనున్నాయి.
ఈ విమానం విశాఖ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి 7.30కి గన్నవరం చేరుకుంటుంది. కొద్దిసేపు విరామం తర్వాత 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి 9.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి 10.30కు గన్నవరం వచ్చి, 25 నిమిషాల విరామం తర్వాత 10.55కు బయలుదేరి 11.55కు వైజాగ్‌కు చేరుతుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. బుధవారం మాత్రం వైజాగ్‌లో ఉదయం 10.45కు బయలుదేరి విజయవాడకు 11.45కు చేరుకుని, తిరిగి 12.10కు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కు హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.10కు బయలుదేరి 3.10 గంటలకు గన్నవరం చేరుకుని, 25 నిమిషాల విరామం తర్వాత తిరిగి బయలుదేరి సాయంత్రం 4.35కు వైజాగ్ చేరుతుంది.