విజయవాడ నుంచి హైదరాబాద్, తిరుపతికి..
గన్నవరం : విజయవాడ నుంచి హైదరాబాద్, తిరుపతికి శుక్రవారం నుంచి ఎయిరిండియా సర్వీసులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పటికే న్యూఢిల్లీకి రెండు సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ విజయవాడ ఆంధ్రప్రదేవ్ రాజధాని అయిన నేపథ్యంలో ఇక్కడ నుంచి మరిన్ని సర్వీసులను నడిపేందుకు ముందుకొచ్చింది. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒకేరోజు రెండు సర్వీసులను ఎయిరిండియా అధికారులు ప్రారంభించారు.
ఈ విమానం ప్రతిరోజు ఉదయం 7.45కు హైదరాబాద్లో బయల్దేరి 8.55 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.25కు ఇక్కడ నుంచి బయల్దేరి 10.45కు తిరుపతి చేరుకుని అక్కడ నుంచి అరగంట విరామం అనంతరం 11.15కు బయల్దేరి తిరిగి 12.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది.
అలాగే మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 2.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ను రూపొందించారు. మరో వారం రోజుల వ్యవధిలో చెన్నై, బెంగళూరు, వైజాగ్కు కూడా ఇక్కడనుంచి విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సంస్థ సన్నాహాలు చేస్తోంది.