న్యూఢిల్లీ: భారీ రుణభారంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా... కొన్నాళ్లుగా నిధుల కొరతతో తీవ్రంగా సతమతమవుతోంది. రిపేర్లకు, స్పేర్ పార్టులు కొనేందుకు కూడా డబ్బులు లేక పలు విమానాలను నిరుపయోగంగా పక్కన పడేసింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి (పీఏసీ) పౌర విమానయాన శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం.. ఎయిరిండియాలో ప్రతి నెలా రూ. 200– 250 కోట్ల మేర నగదు లోటు ఉంటోంది.
నిర్వహణకు తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఎయిరిండియా విమానాలకు విడి భాగాలు కూడా కొనలేకపోతోందని, దీంతో కంపెనీకి చెందిన అనేక విమానాలు నిరుపయోగంగా మూలన పడి ఉంటున్నాయని పౌర విమానయాన శాఖ.. పీఏసీకి తెలిపింది. కొన్ని విమానాల లీజును పునరుద్ధరించినప్పటికీ.. నిర్దిష్ట షరతులను పూర్తి చేయాల్సి ఉన్నందున వాటిని కూడా సంస్థ నడపలేకపోతోందని వివరించింది.
నిర్వహణ వ్యయాల్లో మెయింటెనెన్స్ ఖర్చుల వాటా 12 శాతానికి పెరిగి రూ. 2,500 కోట్ల స్థాయిలో ఉంటోందని పేర్కొంది.దాదాపు రూ. 48,876 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియాను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడే దిశగా... ప్రాపర్టీల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకునేందుకు ఉద్దేశించిన టర్న్ అరౌండ్ ప్రణాళికను 2011 నుంచి అమలు చేస్తున్నప్పటికీ సంస్థకు అవసరమైన నిధులు సమకూరడం లేదు.
దీని ప్రకారం ఏటా రూ.500 కోట్ల సమీకరించుకునే అవకాశం ఉన్నప్పటికీ... టైటిల్ డీడ్స్‌లో లోపాలు, లీజుకిచ్చిన ప్రాపర్టీని అమ్ముకోవడానికి లేదంటూ పట్టణాభివృద్ధి శాఖ అడ్డం పడటం మొదలైన వాటి కారణంగా ఇప్పటిదాకా కేవలం రూ.725 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగింది.
అమ్మకానికి నిబంధనల సడలింపు..
కఠిన నిబంధనల పేరిట ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థా ముందుకు రాకపోతుండటంతో ప్రభుత్వం కొన్ని షరతులను సడలించింది. ఎయిరిండియాను కొనుక్కున్న సంస్థ... హోల్డింగ్ కంపెనీ కింద దాన్ని నిర్వహించే వెసులుబాటునివ్వాలని నిర్ణయించింది. ఒకవేళ ఇప్పటికే కొనుగోలు కంపెనీకి ఇతర ఎయిర్‌లైన్ బ్రాండ్ ఉన్న పక్షంలో రెండింటినీ సమన్వయం చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది.
‘ఉదాహరణకు కొనుగోలుదారుకు ఇప్పటికే ఎ, బి అనే ఎయిర్‌లైన్స్ బ్రాండ్స్ ఉంటే... ఆ రెండింటితో పాటు ఎయిరిండియాను కూడా ఒకే హోల్డింగ్ కంపెనీ కిందికి చేర్చవచ్చు. అయితే, మూడేళ్లు గడిచే దాకా మిగతా బ్రాండ్స్‌తో ఎయిరిండియాను విలీనం చేయడానికి ఉండదు’ అని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఉన్న షరతుల ప్రకారం ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాలు కొనసాగినంత కాలం కొనుగోలుదారు దాన్ని ప్రత్యేకంగానే కొనసాగించాల్సి ఉంటుంది.
భారీ మార్పులు చేయడానికి గానీ తమ గ్రూప్‌లోని ఇతర వ్యాపారాల్లో దీన్ని విలీనం చేయడానికి గానీ లేదు. గతంలో ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ తదితర సంస్థలు ఆసక్తి కనపర్చినప్పటికీ.. ఇలాంటి నిబంధనల కారణంగా వెనక్కి తగ్గాయి. అసలు బిడ్డర్లే కరువవడంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం నిబంధనలను పునఃసమీక్షించింది.
అంతర్జాతీయంగా ఏవియేషన్ రంగంలో కొనుగోళ్లు, విలీనాల డీల్స్‌కి సంబంధించి హోల్డింగ్ కంపెనీ విధానం సర్వసాధారణంగానే అమలవుతోంది. ఉదాహరణకు 2005లో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా సంస్థ.. స్విట్జర్లాండ్‌కి చెందిన స్విస్‌ను కొనుగోలు చేసినప్పుడు ఎయిర్‌ట్రస్ట్ అనే హోల్డింగ్ కంపెనీని పెట్టి, స్విస్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికీ స్విస్ సర్వీసులు ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment