
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ ’విస్తార’... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను వివరించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తార.. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటింది. ప్రస్తుతం కంపెనీకి ఏ–320 రకం విమానాలు 21 ఉన్నాయి. 22 ప్రాంతాలకు వారానికి 800 పైచిలుకు ఫ్లయిట్స్ నడుపుతోంది. ఈ ఏడాది విదేశీ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.
రెండు సంస్థలతో ఒప్పందాలు..
కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలోనే కొత్తగా ఎయిర్‌బస్ సంస్థ నుంచి ఏ320 నియో రకానికి చెందిన 13 విమానాలు, బోయింగ్ నుంచి 6 డ్రీమ్‌లైనర్స్‌ను (787–9 ఎయిర్‌క్రాఫ్ట్) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విస్తార పేర్కొంది. ఎయిర్‌బస్‌తో ఒప్పందం ప్రకారం విస్తార ముందుగా ఏ320, ఏ321 రకానికి చెందిన 13 విమానాలను కొనుగోలు చేయనుంది. సందర్భాన్ని బట్టి మరో ఏడు ఏ320 రకం విమానాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఏ320 నియో విమానాలను కూడా విస్తార లీజు కు తీసుకోనుంది. నియో విమానాలు 2019– 2023 మధ్య డెలివరీ అయ్యే అవకాశముంది. ఈ విమానాలను దేశీ రూట్లలోనూ, సందర్భాన్ని బట్టి అంతర్జాతీయ రూట్లలోనూ ఉపయోగించనున్నారు. ఇక, బోయింగ్‌తో ఒప్పందం ప్రకారం విస్తార 787–7 డ్రీమ్‌లైనర్ విమానాలు ఆరు కొనుగోలు చేయనుంది. 787 డ్రీమ్‌లైనర్ కోవకి చెందిన మరో నాలుగింటినీ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment