హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం
చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్‌లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్‌కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టాం.
ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు.