
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా ఉన్నతాధికారులపై సీబీఐ కేసు నమోదు కావడం ఎయిర్ ఏషియా ప్రమాణాల పతనానికి నిదర్శనమని సైరస్ పి. మిస్త్రీ వ్యాఖ్యానించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బలవంతంగా తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చేసిన నిరాధారమైన ఆరోపణల వల్లే ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు చోటు చేసుకుందని ఎయిర్‌ఏషియా డైరెక్టర్ ఆర్. వెంకటరామన్ చేసిన ఆరోపణలపై సైరస్ మిస్త్రీ మండిపడ్డారు. వెంకటరామన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఆ ఆరోపణలన్నీ దురుద్దేశపూరితమైనవేనని పేర్కొన్నారు.
దురుద్దేశపూరిత లక్ష్యాలున్న వ్యక్తుల వల్లే టాటా బ్రాండ్‌కు చెడ్డపేరు వస్తోందని మిస్త్రీ విమర్శించారు. ఎయిర్ ఏషియా ఇండియా ఏర్పాటైనప్పటి నుంచి వెంకటరామన్ వివిధ పాత్రలు పోషించారని వివరించారు. ఎయిర్‌ఏషియా కంపెనీ బోర్డ్‌లో టాటా సన్స్ నామినీ డైరెక్టర్‌గానే కాకుండా ఆ కంపెనీలో 1.5 శాతం వాటా కూడా వెంకటరామన్‌కు ఉందని పేర్కొన్నారు. తాను నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను మాత్రమేనని, ఎలాంటి బాధ్యతలు లేవని వెంకటరామన్ చెప్పడం సమంజసం కాదని వివరించారు.