టాటా గ్రూపును వీడని మిస్త్రీ బోర్డ్ వార్!
ముంబై: టాటా-మిస్త్రీ బోర్డ్ వార్ ఇంకా టాటా గ్రూపును ఇంకా వెన్నాడుతూనే ఉంది. టాటా సన్స్ ఛైర్మన్గా సైరస్ ఉద్వాసన అనంతర పరిణామాల నేపథ్యంలో టాటా గ్రూపునకు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్ ర్యాంక్ నుంచి వైదొలగింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ ర్యాంకింగ్ 21 స్థానాలు కిందికి దిగజారింది. గత ఏడాది 82వ స్థానం నుంచి ఈ ఏడాది 103 స్థానంలో నిలిచింది. అంతేకాదు టాప్ 100 జాబితానుంచి కిందికి పడిపోవడం ఇదే మొదటి సారని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది.
ఒకపుడు టాప్ 100 జాబితాలో ఏకైక భారతీయ బ్రాండ్ గా నిలిచిన టాటా గ్రూపు 2016 సం.రానికి వచ్చేసరికి అసలు ఆ జాబితాలోనే చోటును కోల్పోయింది. 2014లో 34 వ స్థానంలో ఉన్నటాటా గ్రూపు క్రమంగా తన ర్యాంకింగ్ ను కోల్పోతూ వస్తోంది. 2015లో 65వ స్థానానికి, ఆతరువాత 82 స్థానానికి పరిమితమైంది.
బ్రాండ్ ఫైనాన్స్ టాప్ 500 కంపెనీల జాబితాలో ఎయిర్టెల్ ర్యాంక్ బాగా ఎగబాకింది. 2015 లో 242 స్థానం నుంచి పుంజుకుని 190 వద్ద నిలిచింది. ఇదే బాటను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనుసరించింది . 283 వ ర్యాంక్ నుంచి 222 స్థానానికి అధిగమించింది. ఇన్ఫోసిస్ ర్యాంక్ 251గా ర్యాంక్ ను సాధించగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్ 244 నుంచి 294 ర్యాంక్ కు పడిపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 442నుంచి 345కి ఎగబాకింది.
కాగా గత ఏడాది అక్టోబర్ లో టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్న మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించింది టాటా గ్రూపు. గ్రూపు అధినేత రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్ గా బాధత్యలను స్వీకరించడంతో దుమారం రేగింది. టాటా గ్రూపునకు, మిస్త్రీకి మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది. అటు టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త చైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.