12 నుంచి ఎయిర్‌ఏషియా ఫ్లయిట్ సర్వీసులు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియా దేశీయంగా జూన్ 12 నుంచి విమానయాన సర్వీసులు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి (శుక్రవారం) అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఎయిర్‌ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ట్విటర్‌లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అయితే, తొలుత ఏ రూట్లో సర్వీసులు నడపనున్నదీ వెల్లడించలేదు. ఎయిర్‌ఏషియా ఇండియా .. చెన్నైని హబ్‌గా పరిగణిస్తుండటంతో అక్కణ్నుంచే ఫ్లయిట్ సేవలు మొదలు కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
టాటా సన్స్, వ్యాపారవేత్త అరుణ్ భాటియాకి చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్, మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియా కలిసి ఎయిర్‌ఏషియా ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సంస్థకి ఈ నెలలోనే ఫ్లయింగ్ పర్మిట్లు లభించాయి. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ తదితర చౌక విమానయాన సంస్థలకు పోటీగా అత్యంత తక్కువ చార్జీలతో ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపడంపై కంపెనీ దృష్టి పెడుతోంది. ప్రస్తుత మార్కెట్ చార్జీల కంటే తమ రేట్లు సుమారు 35 శాతం తక్కువగా ఉండగలవంటూ ఎయిర్‌ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య గతంలో తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది వ్యవధిలో పది ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని నిర్దేశించుకుంది.