భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం!
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్ అంచనా
న్యూఢిల్లీ: భారత్ పౌర విమానయాన మార్కెట్ రానున్న కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్లలో ఒకటిగా ఉద్భవించనుందని ఏయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్ (ఏసీఐ) తన తాజా నివేదికలో అంచనావేసింది. పెరుగుతున్న విమానయాన ప్రయాణీకులు ఇందుకు కారణమని తెలిపింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణీకులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల విషయంలో భారత్, చైనా, కొరియాలోని పెద్ద కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌లు కీలకపాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే...
⇔ విమానయాన మార్కెట్‌లో సంస్కరణలు, పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ కలిసి భారత్‌లో ఈ రంగం గణనీయ వృద్ధికి దోహదపడుతోంది.
⇔ ఆసియా-పసిఫిక్‌లో జూన్‌లో విమాన ప్రయాణీకుల సంఖ్య 9.9 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 8.8 శాతం.
⇔ 2016 తొలి 6 నెలల్లో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2015 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 8.2% నుంచి 10.1%కి పెరిగింది.
⇔ చైనా, భారత్, కొరియాల విషయంలో ప్రయాణీకుల పెరుగుదల శాతాలు వరుసగా 12.1 శాతం, 17 శాతం, 14.1 శాతంగా ఉన్నాయి.
⇔ భారత్‌లో ఒక్క దేశీయ ప్రయాణీకుల సంఖ్య మొదటి ఆరు నెలల్లో 20.6 శాతం నమోదైంది.
⇔ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల విషయంలో జూన్‌లో 21.5% వృద్ధి కాగా, వార్షికంగా 4.4%.
⇔ భారత్ విమానయాన సరకు రవాణా విషయంలో వృద్ధి 6 నెలల్లో దేశీయంగా 4.1%, అంతర్జాతీయంగా 10.5 శాతంగా నమోదైంది.
⇔ ప్రపంచ విమానాశ్రయాల సంఘమే ఏసీఐ. 1991లో ఏర్పాటయిన ఈ సంఘంలో 173 దేశాల్లో 1,853 ఎయిర్‌పోర్ట్‌లు నిర్వహిస్తున్న 592 సంస్థలకు సభ్యత్వం ఉంది.