తెలుగు రాష్ట్రాల్లోకి త్వరలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
న్యూఢిల్లీ: ఇటీవల రాజస్తాన్‌లో పైలట్ సర్వీసుల్ని ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ త్వరలో దక్షిణాదికి విస్తరించనుంది. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తమ సర్వీసుల్ని మొదలుపెడతామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ శశి అరోరా చెప్పారు. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రజలకు బ్యాంకింగ్ ప్రయోజనాల్ని కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి 20,000 రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామని, కర్ణాటకలో 15,000 వరకూ అవుట్‌లెట్స్ నెలకొల్పుతామని ఆయన వివరించారు.
ఈ అవుట్‌లెట్స్ ద్వారా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ తదితర బ్యాంకింగ్ సర్వీసుల్ని పొందవచ్చని ఆయన తెలిపారు. మరికొద్దివారాల్లో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసుల్ని ప్రారంభిస్తామన్నారు.
రాజస్తాన్‌లో పైలట్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టిన తర్వాత పక్షం రోజుల్లో లక్ష వరకూ సేవింగ్స్ ఖాతాల్ని ఖాతాదారులు తెరిచినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటన తెలిపింది. ఇందులో దాదాపు 70 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరిచినట్లు బ్యాంక్ తెలిపింది. ఆ రాష్ట్రంలో 10,000 రిటైల్ అవుట్‌లెట్స్‌ను నెలకొల్పింది.