ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్
డీల్ విలువ రూ.3,438 కోట్లు
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌కు చెందిన 4 జీ స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్ కంపెనీకి 8 టెలికం సర్కిళ్లలో ఉన్న 4జీ స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ కంపెనీ రూ. 3,438 కోట్లకు కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఎయిర్‌సెల్ అనుబంధ సంస్థలైన డిష్‌నెట్ వెర్లైస్, ఎయిర్‌సెల్ సెల్యులర్ కంపెనీలకు ఎయిర్‌టెల్ కంపెనీ, తన అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నై కలసి), బిహార్, జమ్మూ, కశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో-మొత్తం 8 టెలికం సర్కిళ్లలో ఎయిర్‌సెల్ 4జీ స్పెక్ట్రమ్ ఎయిర్‌టెల్ చేతికి వస్తుంది.
దీంతో ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 4జీ సేవలందించే వీలు కలుగుతుంది. ఒక నెల కాలంలో ఎయిర్‌టెల్‌కు ఇది రెండో డీల్. భారతీ ఎయిర్‌టెల్ ఇటీవలనే వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స నుంచి ఆరు టెలికం సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రమ్‌ను రూ.4,428 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఎయిర్‌సెల్ నుంచి కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై ఎయిర్‌టెల్‌కు 2030, సెప్టెంబర్ 20 వరకూ హక్కులుంటాయి.