ఇంటర్నెట్ కారు వచ్చేసింది!
కారులో వెళ్తుంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం కొంచెం కష్టమే. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్నెట్ కనెక్టెడ్ కారు ఒకదాన్ని అలీబాబా గ్రూపు గురువారం ఆవిష్కరించింది. త్వరలోనే వాణిజ్యస్థాయిలో కూడా ఈ కార్లను తయారుచేస్తామంటున్నారు. దీనికి ‘యన్ ఓఎస్’ అని పేరు పెట్టారు. ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్తో కలిసి ఈ కారును ఆటోమొబైల్ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు అలీబాబా గ్రూపు చెబుతోంది. ఇందులో మరింత శక్తిమంతమైన యాక్సిలరేటర్, తక్కువ ఆయిల్ వినియోగం, బ్రేక్ పడటానికి తక‍్కువ దూరం తీసుకోవడం లాంటి సదుపాయాలున్నాయి.
క్లౌడ్ ఆధారిత డేటాను వాడుకునే ఈ కారులో ఇంటెలిజెంట్ మ్యాప్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ వాయిస్ కంట్రోల్ ద్వారా ఇది ఆదేశాలు తీసుకుంటుంది. అందువల్ల సాధారణ డ్రైవింగ్ కంటే మరింత సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. దీనికి నాలుగు డిటాచబుల్ యాక్షన్ కెమెరాలు ఉంటాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో ప్రయాణం మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయడంతో పాటు కారులో సెల్ఫీలు కూడా తీస్తాయి. స్మార్ట్ ఫోనును కారుకు కనెక్ట్ చేయడం ద్వారా ఆ సెల్ఫీలను అప్పటికప్పుడే షేర్ చేసుకోవచ్చు. ఈ కారు ధర సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.