
‘యూసీ న్యూస్’ను ఆవిష్కరించిన యూసీ వెబ్
న్యూఢిల్లీ: అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్ సంస్థ తాజాగా ‘యూసీ న్యూస్’ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను (యాప్) ప్రారంభించింది. ఇది క్రికెట్, మూవీస్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి దాదాపు 20కి పైగా చానళ్లకు సంబంధించిన వార్తలను ఒకే చోట అందిస్తుంది. అలాగే ఇది ట్రెండింగ్ వార్తలను వినియోగదారులకు సిఫార్సు చేస్తుంది. యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే యూసీ బ్రౌజర్‌ను ఉపయోగిస్తూ ఉంటే అందులో కూడా ‘యూసీ న్యూస్’ సేవలను పొందొచ్చు.
యూసీ బ్రౌజర్ యూజర్లలో 20 శాతం భారత్ నుంచే...
యూసీ బ్రౌజర్ గ్లోబల్ యూజర్లలో 20 శాతం భారతీయులే ఉన్నారు. ఈ విషయాన్ని యూసీ వెబ్ సంస్థ వెల్లడించింది. ఇక్కడ నెలవారీ యాక్టివ్ యూజర్లు 8 కోట్లుగా ఉన్నారని తెలిపింది. భారత్ తమకు ప్రధానమైన మార్కెట్ అని, చైనా తర్వాత భారత్‌లోనే యూజర్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల యూజర్లలో భారత్ వాటా 20 శాతంగా ఉందని తెలిపింది. కాగా సంస్థ 2జీ నెట్‌వర్క్‌లో కూడా మెరుగైన సేవలను అందించడం, ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో తీసుకురావడం వంటి అంశాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది.