మహిళా బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం?
2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బిఎంబి)ను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని ఆర్థికశాఖ భావిస్తోంది. గత ఏడాది వార్తల్లో నిలిచిన ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిళా సాధికారిత కోసం మాజీప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన మహిళా బ్యాంకుల (బిఎంబి) విలీనానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, విలీనానికి కేంద్రం శరవేగంగా పావులు కదుపుతోంది. దీంతో ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ వివాదంగా మారనుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బీఎంబీల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు. అటు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కూడా దీనిపై దృష్టిపెట్టింది.
అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఇది భయంకరమైన ఆలోచని అని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన బ్యాంకు కావడంవల్లే విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు బీఎంబీ వర్గాల నుంచి దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకుల భవితవ్యంపై నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఎం స్వాతి చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితి కొనసాగితే దీని ప్రభావం ఉద్యోగులపైనా, బ్యాంకులపైనా పడుతుందన్నారు. ఒకపక్క బ్యాంకులకు లైసెన్సులు ఇస్తూ, ఉన్న బ్యాంకులను విలీనం చేయడంపై బ్యాంకు సీనియర్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో సముచిత వ్యాపారాలు నిర్వహించడానికి ఎక్కువ బ్యాంకులు అవసరమైనపుడు బీఎంబీతో సమస్య ఏంటని ప్రశ్నించారు. లాంచింగ్ తరువాత భారతీయ మహిళాబ్యాంకు విశిష్టతను కోల్పోయిందని, కస్టమర్లు, ఉద్యోగులు అందరూ పురుషులే ఉన్నారని ప్రధాన మేనేజింగ్ భాగస్వామి అశ్వినీ పరేఖ్ వ్యాఖ్యానించారు.
కాగా గతంలో ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా విలీనంపై సానుకూలంగా స్పందించారు. క్యాబినెట్‌లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని, భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే బిఎంబి చాలా చిన్న సంస్ధ అని అభిప్రాయపడ్డారు.