న్యూఢిల్లీ: పండుగల సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఆఫర్ ఉంటుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కలిగినవారు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందుకోవచ్చు. భారత్‌లో ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈసారి ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పూర్తిచేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది.
స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్
పలు అధునాతన స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్, అదనపు క్యాష్‌బ్యాక్, ఎక్సే్ఛంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ, ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రత్యేక ఆఫర్లను గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌లో అందించనుంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ, ఓపో, వివో వంటి ప్రఖ్యాత బ్రాండ్లు అందుబాటులో ఉండగా.. ఎక్సే్ఛంజ్ ఆఫర్ కింద రూ. 6,000 వరకు ఇవ్వనుంది. మొబైల్ కేసులు, కవర్ల ప్రారంభ ధర రూ. 69గా ప్రకటించింది. బ్లూ టూత్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
టీవీ, ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు
గృహోపకరణాలు, టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులు ఈ విభాగంలో ఉన్నట్లు తెలిపింది. టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్ ప్రారంభ ధర రూ. 9,999 కాగా, స్ప్లిట్ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉందని ప్రకటించింది. కిచెన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఉండగా.. ఈ విభాగంలో 50వేలకు మించి ఉత్పత్తులు ఉండనున్నాయి. వీటిలో సగానికి పైగా వస్తువులపై 50 శాతం కనీస డిస్కౌండ్ ఉన్నట్లు వెల్లడించింది. రూ. 99 ప్రారంభ ధర నుంచి ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపింది.
ఫ్యాషన్‌పై 90 శాతం డిస్కౌంట్
లక్షకు మించిన ఫ్యాషన్ డీల్స్, 1200 బ్రాండ్స్ ఈసారి ప్రత్యేకతగా అమెజాన్ వెల్లడించింది. దుస్తులు, పాదరక్షలు, వాచీలపై 80 శాతం, నగలపై 90 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇక నిత్యావసర వస్తువులు, ఆట బొమ్మలపై భారీ డిస్కౌంట్ ఉన్నట్లు తెలిపింది. బెస్ట్ సెల్లింగ్ బుక్స్‌పై 70 శాతం వరకు ఆఫర్ ఉన్నట్లు వెల్లడించింది.
మీ చెంతకే ‘హౌస్ ఆన్ వీల్స్’..
దేశంలోని 13 నగరాల్లో ‘హౌస్ ఆన్ వీల్స్’ పేరిట 600 ఉత్పత్తులను వినియోగదారుల చెంతకే చేర్చనుంది. మూడు హెవీ కంటైనర్లను కలిపి రూపొందించిన ఈ ప్రత్యేక వాహనం ఢిల్లీ, విశాఖపట్నం, చెన్నై, మధుర, ఆగ్రా, లక్నో, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, కొచ్చిల్లో మొత్తం 6,000 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
Comments
Please login to add a commentAdd a comment