అమెజాన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది!
అమెజాన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది!
Published Wed, Apr 23 2014 2:32 AM | Last Updated on Fri, May 25 2018 7:16 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా దీనిని మార్కెట్లోకి తేనుంది. ఇప్పుడున్న ఫోన్లతో పోలిస్తే ఇది భిన్నంగానే ఉంటుందని కంపెనీ ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇప్పటికే ఈ సంస్థ కిండిల్ ఫైర్ పేరుతో ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేయడం తెలిసిందే. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను సెకనుకు 352 విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటిలో ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు కూడా ఉన్నాయి. సంస్థకు డెవలపర్లతో దీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉండడం, అలాగే కస్టమర్లకున్న సానుకూల అభిప్రాయమే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లపై దృష్టిసారించేలా చేసిందని తెలుస్తోంది.
కిండిల్ బ్రాండ్‌లోనే స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి.
ఆరు కెమెరాలతో..: కిండిల్ స్మార్ట్‌ఫోన్‌కు ఆరు కెమెరాలు పొందుపరుస్తున్నట్టు సమాచారం. వెనుకవైపు 13 ఎంపీ కెమెరాతోపాటు ముందువైపు మొత్తం 5 కెమెరాలు ఉంటాయి. ఫోన్ వినియోగించేవారి కళ్లను ట్రాక్ చేసేందుకు నాలుగు కెమెరాలు పనిచేస్తాయి. ఫోన్‌ను వాడుతున్న వ్యక్తి కంటిచూపును బట్టి ఫోన్ ఫీచర్స్ స్పందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 3డీ టెక్నాలజీ దీని మరో ప్రత్యేకత. కళ్లజోడు అవసరం లేకుండానే 3డీ వీక్షణం సాధ్యపడుతుంది. బార్‌కోడ్ స్కాన్ చేసే సౌకర్యం, స్క్రీన్ సైజు 4.7 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపర్చనున్నారు. ఇక ధర మధ్యతరగతికి అందుబాటులోనే ఉంటుందని తెలుస్తోంది.
Advertisement