ఆల్‌లైన్‌లో కొనేద్దాం..!
ముంబై: ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవారి సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. దీంతో ఆన్‌లైన్ రిటైల్ విభాగం షాపర్లతో కళకళలాడుతోంది. అసోచామ్, కామ్‌స్కోర్‌లు ‘భారత్‌లో ఈ-కామర్స్ ప్రస్తుత పరిస్థితి’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... జూలై నెలకు సంబంధించి భారత్‌లోని మొత్తం ఆన్‌లైన్ యూజర్లలో రిటైల్ విభాగానికి చెందిన వెబ్‌సైట్లను సందర్శించిన షాపర్ల సంఖ్య 65 శాతానికి ఎగబాకింది.
ఈ ఒక్క నెలలోనే 5.34 కోట్ల మంది రిటైల్ వెబ్ విజిటర్లు నమోదయ్యారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వృద్ధి 15 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రిటైల్ కేటగిరీల్లో దుస్తుల(అపారెల్) విభాగం అత్యధికంగా 66 శాతం, సౌందర్య ఉత్పత్తుల(కాస్మెటిక్స్, ఫ్రాగ్నెన్సెస్) విభాగంలో 12 శాతం చొప్పున ఆన్‌లైన్ కొనుగోలుదారులు(మొత్తం షాపర్లలో) నమోదయ్యారు. దాదాపు అన్ని రిటైల్ సెగ్మెంట్లలోనూ ఉత్పత్తుల కోసం వెబ్‌సైట్లను సందర్శిస్తున్న వారి సంఖ్య పెరిగిందని.. ఇందులో చాలావరకూ కొనుగోలు లావాదేవీలుగా మారుతున్నాయని కూడా నివేదిక తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ టాప్..: ఆన్‌లైన్ షాపర్లను ఆకర్షించడంలో దేశీ ఈ-కామర్స్ దిగ్గజం తన హవాను కొనసాగిస్తోంది. జూలైలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వెబ్‌సైట్లను(మింత్రాతో కలిపి) 2.6 కోట్ల మందికిపైగా షాపర్లు సందర్శించినట్లు నివేదిక పేర్కొంది. తర్వాత స్థానంలో జబాంగ్(2.35 కోట్ల మంది విజిటర్లు), అమెజాన్(1.69 కోట్ల మంది) ఉన్నాయి. ఇక ట్రావెల్ విభాగంలోని అన్ని ఉప విభాల్లోనూ భారీగా ఆన్‌లైన్ విజిటర్ల సంఖ్య వృద్ధి నమోదవుతోంది.
ముఖ్యంగా కార్ రెంటల్స్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్‌లైన్స్, హోటల్స్, ట్రావెల్ సమాచారం ఇతరత్రా విభాగాలు ఇందులో ప్రధానమైనవి. జూలైలో 1.5 కోట్ల మంది వెబ్‌సైట్ విజిటర్లతో ఇండియన్ రైల్వేస్ టాప్ లో నిలిచింది. తర్వాత స్థానాల్లో మేక్‌మై ట్రిప్(మొత్తం ఆన్‌లైన్ యూజర్లలో 8.5% మంది విజిటర్లు), యాత్రా(7.6%), క్లియర్‌ట్రిప్(3.5%)లు ఉన్నాయి.
ఇతర ముఖ్యాంశాలివీ...
ఆన్‌లైన్ షాపింగ్ యూజర్ల వృద్ధి జోరులో 15-24 ఏళ్ల వయసు వాళ్లే అత్యధికంగా ఉంటున్నారు.
ఆన్‌లైన్‌లో అత్యధికంగా యూజర్లను ఆకర్షిస్తున్న టాప్-5 కేటగిరీల్లో నంబర్ వన్‌గా సోషల్ నెట్‌వర్కింగ్(ఫేస్‌బుక్, ట్విటర్ ఇతరత్రా) నిలుస్తోంది. తర్వాత స్థానాల్లో పోర్టల్స్, సెర్చ్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ సైట్లు ఉన్నాయి.
పలు వ్యాపారాల్లో అమ్మకాలకు ఈ-కామర్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.