Online Retail
-
వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు. పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్‌ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్‌లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్ల ప్రత్యేకతలను డిజిటల్‌గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చు. టయోటా వీల్స్ ఆన్ వెబ్‌లో కస్టమర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్‌పేమెంట్‌ను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆన్లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు. -
జోరుగా ఇ-టెయిల్ మార్కెట్
ముంబై: భారత్‌లో ఆన్లైన్ రిటైల్‌కు సంబంధించి ఈ-టెయిల్ మార్కెట్ జోరుగా పెరుగుతోంది. భారత ఈ-కామర్స్ రంగంలో ఒక విభాగమైన ఈ-టెయిల్ మార్కెట్ 2020 కల్లా ప్రస్తుతమున్న దాని కంటే 10 రెట్లు పెరిగి 5,000 కోట్ల డాలర్లకు చేరుతుందని యూబీఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రజల ఆదాయాలు పెరుగుతుండడం, ఇంటర్నెట్ శరవేగంగా విస్తరిస్తుండడం వంటి కారణాల వల్ల ఈ-టెయిల్ బాగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., - ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)... భారత్‌లో విజయవంతమైన భారత ఈ-కామర్స్ వెంచర్‌కు ఒక మంచి ఉదాహరణ. గతేడాది ఐఆర్సీటీసీ మొత్తం అమ్మకాలు 300 కోట్ల డాలర్లను మించాయి. భారత వినియోగదారులు టెక్నాలజీని ఆమోదించడానికి సిద్ధంగానే ఉన్నారన్న విషయాన్ని ఐఆర్సీటీసీ విజయం వెల్లడిస్తోంది. - భారత్‌లో ఈ కామర్స్ది బలుపు కాదు వాపు అనే భావన సరైనది కాదు. -
'మెరుపు' కథలు!
⇒ మొబైల్ ఫోన్ అమ్మకాల్లో ‘ఫ్లాష్’ వ్యూహం ⇒ సెకన్ల వ్యవధిలోనే వేలకు వేల విక్రయాలు అంతా ప్రచార వ్యూహమే: పోటీ కంపెనీలు ⇒ వాస్తవ అమ్మకాలు తక్కువే ఉంటాయని వ్యాఖ్యలు ⇒ కస్టమర్లకు కొంత లాభం... కొంత నష్టం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లాష్ సేల్... అంటే మెరుపు సేల్ అన్న మాట. కంపెనీలు చెబుతున్న లెక్కలు చూస్తుంటే నిజంగానే ఈ ఫోన్లన్నీ మెరుపు వేగంతో అమ్ముడయిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మెరుపు లెక్కలన్నీ నిజమా! కాదా? అనే విషయమై ఎన్నెన్నో సందే హాలున్నాయి. ఎందుకంటే కంపెనీలు చెబుతున్న లెక్కలకు మరే ఇతర ఆధారాలూ లేవు కనక. నిజానికి ఈ ఫ్లాష్ సేల్‌ను తొలుత పరిచయం చేసింది షియోమీ కంపెనీయే. ఆ తరవాత లెనోవో, ఒన్‌ప్లస్ ఒన్, మైక్రోమ్యాక్స్, మోటోరోలా... ఇలా ఫ్లాష్ మార్గాన్ని ఎంచుకుంటున్న కంపెనీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రకమైన మార్కెటింగ్ వ్యూహంతో వాటికి పలురకాలుగా లాభం కలుగుతోంది తప్ప ఎలాంటి నష్టమూ లేదు. కాస్తోకూస్తో నష్టపోయేదెవరైనా ఉంటే ఆ ఫోన్ కోసం... ఆ ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయే వినియోగదారుడే!! అదెలాగో చూద్దాం. పక్కా మార్కెటింగ్ వ్యూహం... ఆన్లైన్ రిటైల్‌లో ఫ్లాష్ సేల్ అనేది కొత్త మార్కెటింగ్ వ్యూహం. ఒక ఉత్పాదనను ప్రకటించిన తేదీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఏదైనా వెబ్సైట్లో... అదీ ముందుగా పేర్లు నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే విక్రయించటమనేది ఈ విధానం. మొబైల్ ఫోన్ల విషయంలో ఈ సేల్ చాలా పాపులర్ అయింది. కొన్ని రోజుల ముందు నుంచీ ఫ్లాష్ సేల్ తేదీ వరకు ఇదుగో అదుగో అంటూ ఆ మొబైల్‌ను ప్రచారం చేస్తారు. ప్రధానంగా ఆన్లైన్, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఉత్పత్తికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా సంఖ్యలో యూనిట్లు అందుబాటులో ఉంటాయని చెబుతూ... అప్పటికే ఆ సంఖ్యను మించిన రిజిస్ట్రేషన్లు వచ్చాయని కస్టమర్లను ఊరిస్తుంటారు. దీంతో సహజంగానే ఆ ఉత్పత్తి పట్ల ఉత్సుకత పెరుగుతుంది. ప్రచారం తారస్థాయిని చేరుకుంటుంది. నిజానికి ఫ్లాష్ సేల్ సందర్భంగా నిజంగా ఎన్ని యూనిట్లను విక్రయిస్తున్నారనేదానికి ఒక లెక్కాపక్కా లేదు. ఉదాహరణకు 10వేల మంది రిజిస్టర్ చేసుకున్నపుడు 100 ఫోన్లు మాత్రమే విక్రయిస్తే సహజంగానే మిగతా 9,900 మందికీ ఆ ఫోన్ దొరకదు. అది దొరకలేదన్న ప్రచారంతో ఆ ఫోన్‌కు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దానికోసం ఎదురుచూసేవారి సంఖ్యా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇలా మూడునాలుగు సార్లు ఉత్సుకత సృష్టించి... చివరకు ఒకేసారి భారీ ఎత్తున ఫోన్లు విక్రయిస్తున్నారు. అప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. ఇక దానిపై పెద్దగా ఆసక్తి లేదనుకున్నపుడు దాన్ని నేరుగా విక్రయానికి పెడుతున్నారు. ఇలా చేయటం వల్ల మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారులకు లాభమేంటంటే... - ఉచితంగా... లేదా తక్కువ ఖర్చుకే కంపెనీలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. ఆ మోడళ్లపై విపరీతమైన ఉత్సుకత ఏర్పడుతోంది. - కృత్రిమమైన డిమాండ్‌ను సృష్టించటం ద్వారా సదరు వినియోగదారుడు అదే ధరలో అంతకన్నా మంచి ఫీచర్లున్న ఇతర ఫోన్లు దొరుకుతున్నా... వాటివైపు వెళ్లకుండా తమ ఫోన్ కోసమే ఎదురు చూసేలా చేయగలుగుతున్నారు. - కంపెనీలకు మరో లాభమేంటంటే స్టాక్ ఉండకపోవటం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు ఎన్ని వచ్చాయన్నది ముందే తెలుస్తుంది కనక... వాటికన్నా తక్కువ ఫోన్లనే తెచ్చి అందుబాటులో ఉంచుతున్నారు. సహజంగానే సరుకు మిగలదు. ‘‘ఉత్పత్తి అయి బయటకు వచ్చిన ఫోన్లలో ఏ ఒక్కటి అమ్ముడుపోకుండా మిగిలిపోయినా అది కంపెనీకి నష్టమే. ఫ్లాష్ సేల్ వల్ల అలాంటి నష్టాలు ఉండటం లేదు. ముందే డిమాండ్ తెలుస్తుంది కనక దానికన్నా తక్కువ యూనిట్లే అందుబాటులోకి తెస్తున్నాం’’ అని ఒన్ ప్లస్ ఒన్ కంపెనీ ప్రతినిధి ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్’ వార్తాసంస్థతో వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం. - రిజిస్ట్రేషన్ల ద్వారా వినియోగదారుల డేటా కంపెనీలకు అందుతోంది. వారి మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు తమ దగ్గరుంటాయి కనక తాము తెచ్చే ఏ కొత్త ఉత్పత్తి తాలూకు సమాచారాన్నయినా సదరు వినియోగదారులకు పంపటానికి, తమ ఉత్పత్తులను పుష్ చేయడానికి ఇది ఉపకరిస్తోంది. వినియోగదారులు నష్టపోతున్నదిలా.. - వినియోగదారుడికి జరుగుతున్న నష్టమేంటంటే ఒక ఫోన్ ముందే మార్కెట్లోకి వస్తే దాని పనితీరు ఎలా ఉందన్నది సమీక్షలు చూసో, తెలిసినవారు చెబితేనో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే దాన్ని కొంటారు కూడా. కానీ తొలి ఫ్లాష్ సేల్ సమయంలో ఎవ్వరికీ వేరొకరి సమీక్షలు చూసే అవకాశం ఉండదు. కేవలం కంపెనీ ఇస్తున్న సమాచారంపై ఆధారపడి కొనాల్సిందే. అంతా ఒకేసారి కొంటారు కనక ఉత్పత్తి బాగాలేకుంటే కొన్నవారంతా నష్టపోతారు. - ఒక ఉత్పత్తి కోసం వారాల తరబడి ఎదురుచూడటమనేది... ఒకరకంగా ఎప్పటికప్పుడు ఎంచుకుని కొనుక్కునే హక్కును కోల్పోవటం కిందే లెక్క. అదే ధరలో దాంతో సమానమైన ఫీచర్లో, అంతకన్నా ఎక్కువ ఫీచర్లో ఉన్న ఫోన్‌ను వెతుక్కుని కొనుక్కునే అవకాశం ఉన్నా... ఫ్లాష్ ప్రచారం కారణంగా అదే మోడల్ కోసం ఎదురు చూడటం... అప్పటికి దొరక్కుంటే మళ్లీ తరువాతి తేదీ కోసం వేచి చూడటం చేయాల్సి వస్తోంది. ఇవీ ఫ్లాష్ వాస్తవాలు... ఇక ఫ్లాష్ సేల్ వాస్తవాల్లోకి వస్తే మైక్రోమ్యాక్స్ ఫ్లాష్ సేల్‌లో భాగంగా జనవరి 13న ‘యురేకా’ మోడళ్లను తొలిసారి విక్రయించినప్పుడు చాలా మంది కస్టమర్లకు ఎర్రర్ పేజీ దర్శనమిచ్చింది. ఇతర కంపెనీల ఫ్లాష్ సేల్ సమయంలోనూ ఇలాంటివే చోటు చేసుకున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గతేడాది ‘బిగ్ బిలియన్ డే’ సేల్ జరిపినపుడు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియంది కాదు. పేజీ తెరుచుకోకపోవటం, తెరుచుకున్నా పేమెంట్ వరకూ వెళ్లకపోవటం, వెళ్లినా ఆర్డర్ ఓకే కాకపోవటం వంటి పలు సమస్యలు తలెత్తాయి. దీనికి ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది కూడా. ఒకే సమయంలో వేలమంది ప్రయత్నించిన సందర్భాల్లో చాలా వెబ్సైట్ల విషయంలో ఇలాగే జరుగుతుంది. అదేం అసహజం కాదుకూడా. ఇవి ప్రత్యేకమైనవేమీ కావు... ఇదంతా మార్కెటింగ్ వ్యూహం. ఇలా ఫ్లాష్ సేల్‌లో విక్రయిస్తున్న ప్రతి మోడలూ ప్రత్యేకమైనదేమీ కాదు. ఒక ఫోన్ కొనుక్కోవడానికి కస్టమర్ అన్ని రోజులపాటు వేచి చూడాల్సిన పని కూడా లేదు. ఫ్లాష్ సేల్‌లో విక్రయిస్తున్న మోడల్స్‌ను పోలిన ఫోన్లు మార్కెట్లో బోలెడన్ని దొరుకుతున్నాయి. కాబట్టే కొన్ని కంపెనీలు తమ ఫోన్లను ఎలాగైనా విక్రయించుకోవటానికి ఈ ఫ్లాష్ సేల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. - వై.గురు, సెల్కాన్ మొబైల్స్ సీఎండీ విలువ ఉంటేనే విక్రయం.. ఉత్పాదన కోసం కస్టమర్‌ను కొన్ని రోజులపాటు ఊరించటమంటే కృత్రిమ కొరత సృష్టించటమే. ఉపకరణాల అమ్మకానికి ఫ్లాష్ సేల్ చక్కని వేదిక. అయినప్పటికీ భారత్‌లో ఈ విధానం అన్ని సందర్భాల్లోనూ విజయవంతం కావడం కష్టమే. భారతీయులు విలువను చూస్తారు. తదుపరి ఫ్లాష్ సేల్‌లో విక్రయించే ఉత్పాదనలో మరిన్ని ఫీచర్లు జోడించారా లేదా అనేది కస్టమర్ బేరీజు వేసుకుంటాడు. కొత్తదనం కనిపిస్తేనే ఓకే చెబుతారు. - అరవింద్ వోరా, జియోనీ ఇండియా హెడ్ -
ఆల్‌లైన్‌లో కొనేద్దాం..!
ముంబై: ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవారి సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. దీంతో ఆన్లైన్ రిటైల్ విభాగం షాపర్లతో కళకళలాడుతోంది. అసోచామ్, కామ్స్కోర్లు ‘భారత్‌లో ఈ-కామర్స్ ప్రస్తుత పరిస్థితి’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... జూలై నెలకు సంబంధించి భారత్‌లోని మొత్తం ఆన్లైన్ యూజర్లలో రిటైల్ విభాగానికి చెందిన వెబ్సైట్లను సందర్శించిన షాపర్ల సంఖ్య 65 శాతానికి ఎగబాకింది. ఈ ఒక్క నెలలోనే 5.34 కోట్ల మంది రిటైల్ వెబ్ విజిటర్లు నమోదయ్యారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ వృద్ధి 15 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రిటైల్ కేటగిరీల్లో దుస్తుల(అపారెల్) విభాగం అత్యధికంగా 66 శాతం, సౌందర్య ఉత్పత్తుల(కాస్మెటిక్స్, ఫ్రాగ్నెన్సెస్) విభాగంలో 12 శాతం చొప్పున ఆన్లైన్ కొనుగోలుదారులు(మొత్తం షాపర్లలో) నమోదయ్యారు. దాదాపు అన్ని రిటైల్ సెగ్మెంట్లలోనూ ఉత్పత్తుల కోసం వెబ్సైట్లను సందర్శిస్తున్న వారి సంఖ్య పెరిగిందని.. ఇందులో చాలావరకూ కొనుగోలు లావాదేవీలుగా మారుతున్నాయని కూడా నివేదిక తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ టాప్..: ఆన్లైన్ షాపర్లను ఆకర్షించడంలో దేశీ ఈ-కామర్స్ దిగ్గజం తన హవాను కొనసాగిస్తోంది. జూలైలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వెబ్సైట్లను(మింత్రాతో కలిపి) 2.6 కోట్ల మందికిపైగా షాపర్లు సందర్శించినట్లు నివేదిక పేర్కొంది. తర్వాత స్థానంలో జబాంగ్(2.35 కోట్ల మంది విజిటర్లు), అమెజాన్(1.69 కోట్ల మంది) ఉన్నాయి. ఇక ట్రావెల్ విభాగంలోని అన్ని ఉప విభాల్లోనూ భారీగా ఆన్లైన్ విజిటర్ల సంఖ్య వృద్ధి నమోదవుతోంది. ముఖ్యంగా కార్ రెంటల్స్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్‌లైన్స్, హోటల్స్, ట్రావెల్ సమాచారం ఇతరత్రా విభాగాలు ఇందులో ప్రధానమైనవి. జూలైలో 1.5 కోట్ల మంది వెబ్సైట్ విజిటర్లతో ఇండియన్ రైల్వేస్ టాప్ లో నిలిచింది. తర్వాత స్థానాల్లో మేక్‌మై ట్రిప్(మొత్తం ఆన్లైన్ యూజర్లలో 8.5% మంది విజిటర్లు), యాత్రా(7.6%), క్లియర్‌ట్రిప్(3.5%)లు ఉన్నాయి. ఇతర ముఖ్యాంశాలివీ... ఆన్లైన్ షాపింగ్ యూజర్ల వృద్ధి జోరులో 15-24 ఏళ్ల వయసు వాళ్లే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్లో అత్యధికంగా యూజర్లను ఆకర్షిస్తున్న టాప్-5 కేటగిరీల్లో నంబర్ వన్‌గా సోషల్ నెట్వర్కింగ్(ఫేస్బుక్, ట్విటర్ ఇతరత్రా) నిలుస్తోంది. తర్వాత స్థానాల్లో పోర్టల్స్, సెర్చ్, ఎంటర్టైన్మెంట్, న్యూస్ సైట్లు ఉన్నాయి. పలు వ్యాపారాల్లో అమ్మకాలకు ఈ-కామర్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. -
అమెజాన్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్ల తయారీ రంగంలోకి వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా దీనిని మార్కెట్లోకి తేనుంది. ఇప్పుడున్న ఫోన్లతో పోలిస్తే ఇది భిన్నంగానే ఉంటుందని కంపెనీ ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇప్పటికే ఈ సంస్థ కిండిల్ ఫైర్ పేరుతో ట్యాబ్లెట్ పీసీలను విడుదల చేయడం తెలిసిందే. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను సెకనుకు 352 విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటిలో ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లు కూడా ఉన్నాయి. సంస్థకు డెవలపర్లతో దీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉండడం, అలాగే కస్టమర్లకున్న సానుకూల అభిప్రాయమే ఇప్పుడు స్మార్ట్ఫోన్లపై దృష్టిసారించేలా చేసిందని తెలుస్తోంది. కిండిల్ బ్రాండ్‌లోనే స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆరు కెమెరాలతో..: కిండిల్ స్మార్ట్‌ఫోన్‌కు ఆరు కెమెరాలు పొందుపరుస్తున్నట్టు సమాచారం. వెనుకవైపు 13 ఎంపీ కెమెరాతోపాటు ముందువైపు మొత్తం 5 కెమెరాలు ఉంటాయి. ఫోన్ వినియోగించేవారి కళ్లను ట్రాక్ చేసేందుకు నాలుగు కెమెరాలు పనిచేస్తాయి. ఫోన్‌ను వాడుతున్న వ్యక్తి కంటిచూపును బట్టి ఫోన్ ఫీచర్స్ స్పందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 3డీ టెక్నాలజీ దీని మరో ప్రత్యేకత. కళ్లజోడు అవసరం లేకుండానే 3డీ వీక్షణం సాధ్యపడుతుంది. బార్కోడ్ స్కాన్ చేసే సౌకర్యం, స్క్రీన్ సైజు 4.7 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపర్చనున్నారు. ఇక ధర మధ్యతరగతికి అందుబాటులోనే ఉంటుందని తెలుస్తోంది.