ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్‌లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు.
పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్‌ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్‌లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.
ఆన్‌లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్‌ల ప్రత్యేకతలను డిజిటల్‌గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్‌లైన్‌లోనే ఎంచుకోవచ్చు.
టయోటా వీల్స్ ఆన్ వెబ్‌లో కస్టమర్‌లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్‌పేమెంట్‌ను ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.
ఆన్‌లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment