'మెరుపు' కథలు! | Consumer agency eyes continuous sales by cell phone | Sakshi
Sakshi News home page

'మెరుపు' కథలు!

Published Sat, Mar 14 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

'మెరుపు' కథలు!

'మెరుపు' కథలు!

మొబైల్ ఫోన్ అమ్మకాల్లో ‘ఫ్లాష్’ వ్యూహం
సెకన్ల వ్యవధిలోనే వేలకు వేల విక్రయాలు  అంతా ప్రచార వ్యూహమే: పోటీ కంపెనీలు
వాస్తవ అమ్మకాలు తక్కువే ఉంటాయని వ్యాఖ్యలు
కస్టమర్లకు కొంత లాభం... కొంత నష్టం


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్లాష్ సేల్... అంటే మెరుపు సేల్ అన్న మాట. కంపెనీలు చెబుతున్న లెక్కలు చూస్తుంటే నిజంగానే ఈ ఫోన్లన్నీ మెరుపు వేగంతో అమ్ముడయిపోతున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ మెరుపు లెక్కలన్నీ నిజమా! కాదా? అనే విషయమై ఎన్నెన్నో సందే హాలున్నాయి. ఎందుకంటే కంపెనీలు చెబుతున్న లెక్కలకు మరే ఇతర ఆధారాలూ లేవు కనక. నిజానికి ఈ ఫ్లాష్ సేల్‌ను తొలుత పరిచయం చేసింది షియోమీ కంపెనీయే. ఆ తరవాత లెనోవో, ఒన్‌ప్లస్ ఒన్, మైక్రోమ్యాక్స్, మోటోరోలా... ఇలా ఫ్లాష్ మార్గాన్ని ఎంచుకుంటున్న కంపెనీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రకమైన మార్కెటింగ్ వ్యూహంతో వాటికి పలురకాలుగా లాభం కలుగుతోంది తప్ప ఎలాంటి నష్టమూ లేదు. కాస్తోకూస్తో నష్టపోయేదెవరైనా ఉంటే ఆ ఫోన్ కోసం... ఆ ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయే వినియోగదారుడే!! అదెలాగో చూద్దాం.
 
పక్కా మార్కెటింగ్ వ్యూహం...
ఆన్‌లైన్ రిటైల్‌లో ఫ్లాష్ సేల్ అనేది కొత్త మార్కెటింగ్ వ్యూహం. ఒక ఉత్పాదనను ప్రకటించిన తేదీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఏదైనా వెబ్‌సైట్లో... అదీ ముందుగా పేర్లు నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే విక్రయించటమనేది ఈ విధానం. మొబైల్ ఫోన్ల విషయంలో ఈ సేల్ చాలా పాపులర్ అయింది. కొన్ని రోజుల ముందు నుంచీ  ఫ్లాష్ సేల్ తేదీ వరకు ఇదుగో అదుగో అంటూ ఆ మొబైల్‌ను ప్రచారం చేస్తారు.

ప్రధానంగా ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఉత్పత్తికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా సంఖ్యలో యూనిట్లు అందుబాటులో ఉంటాయని చెబుతూ... అప్పటికే ఆ సంఖ్యను మించిన రిజిస్ట్రేషన్లు వచ్చాయని కస్టమర్లను ఊరిస్తుంటారు. దీంతో సహజంగానే ఆ ఉత్పత్తి పట్ల ఉత్సుకత పెరుగుతుంది. ప్రచారం తారస్థాయిని చేరుకుంటుంది. నిజానికి ఫ్లాష్ సేల్ సందర్భంగా నిజంగా ఎన్ని యూనిట్లను విక్రయిస్తున్నారనేదానికి ఒక లెక్కాపక్కా లేదు. ఉదాహరణకు 10వేల మంది రిజిస్టర్ చేసుకున్నపుడు 100 ఫోన్లు మాత్రమే విక్రయిస్తే సహజంగానే మిగతా 9,900 మందికీ ఆ ఫోన్ దొరకదు.

అది దొరకలేదన్న ప్రచారంతో ఆ ఫోన్‌కు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. దానికోసం ఎదురుచూసేవారి సంఖ్యా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇలా మూడునాలుగు సార్లు ఉత్సుకత సృష్టించి... చివరకు ఒకేసారి భారీ ఎత్తున ఫోన్లు విక్రయిస్తున్నారు. అప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. ఇక దానిపై పెద్దగా ఆసక్తి లేదనుకున్నపుడు దాన్ని నేరుగా విక్రయానికి పెడుతున్నారు. ఇలా చేయటం వల్ల మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారులకు లాభమేంటంటే...

- ఉచితంగా... లేదా తక్కువ ఖర్చుకే కంపెనీలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. ఆ మోడళ్లపై విపరీతమైన ఉత్సుకత ఏర్పడుతోంది.

- కృత్రిమమైన డిమాండ్‌ను సృష్టించటం ద్వారా సదరు వినియోగదారుడు అదే ధరలో అంతకన్నా మంచి ఫీచర్లున్న ఇతర ఫోన్లు దొరుకుతున్నా... వాటివైపు వెళ్లకుండా తమ ఫోన్ కోసమే ఎదురు చూసేలా చేయగలుగుతున్నారు.

- కంపెనీలకు మరో లాభమేంటంటే స్టాక్ ఉండకపోవటం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు ఎన్ని వచ్చాయన్నది ముందే తెలుస్తుంది కనక... వాటికన్నా తక్కువ ఫోన్లనే తెచ్చి అందుబాటులో ఉంచుతున్నారు. సహజంగానే సరుకు మిగలదు. ‘‘ఉత్పత్తి అయి బయటకు వచ్చిన ఫోన్లలో ఏ ఒక్కటి అమ్ముడుపోకుండా మిగిలిపోయినా అది కంపెనీకి నష్టమే. ఫ్లాష్ సేల్ వల్ల అలాంటి నష్టాలు ఉండటం లేదు. ముందే డిమాండ్ తెలుస్తుంది కనక దానికన్నా తక్కువ యూనిట్లే అందుబాటులోకి తెస్తున్నాం’’ అని ఒన్ ప్లస్ ఒన్ కంపెనీ ప్రతినిధి ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్’ వార్తాసంస్థతో వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం.

- రిజిస్ట్రేషన్ల ద్వారా వినియోగదారుల డేటా కంపెనీలకు అందుతోంది. వారి మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు తమ దగ్గరుంటాయి కనక తాము తెచ్చే ఏ కొత్త ఉత్పత్తి తాలూకు సమాచారాన్నయినా సదరు వినియోగదారులకు పంపటానికి, తమ ఉత్పత్తులను పుష్ చేయడానికి ఇది ఉపకరిస్తోంది.
వినియోగదారులు నష్టపోతున్నదిలా..
- వినియోగదారుడికి జరుగుతున్న నష్టమేంటంటే ఒక ఫోన్ ముందే మార్కెట్లోకి వస్తే దాని పనితీరు ఎలా ఉందన్నది సమీక్షలు చూసో, తెలిసినవారు చెబితేనో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే దాన్ని కొంటారు కూడా. కానీ తొలి ఫ్లాష్ సేల్ సమయంలో ఎవ్వరికీ వేరొకరి సమీక్షలు చూసే అవకాశం ఉండదు. కేవలం కంపెనీ ఇస్తున్న సమాచారంపై ఆధారపడి కొనాల్సిందే. అంతా ఒకేసారి కొంటారు కనక ఉత్పత్తి బాగాలేకుంటే కొన్నవారంతా నష్టపోతారు.

- ఒక ఉత్పత్తి కోసం వారాల తరబడి ఎదురుచూడటమనేది... ఒకరకంగా ఎప్పటికప్పుడు ఎంచుకుని కొనుక్కునే హక్కును కోల్పోవటం కిందే లెక్క. అదే ధరలో దాంతో సమానమైన ఫీచర్లో, అంతకన్నా ఎక్కువ ఫీచర్లో ఉన్న ఫోన్‌ను వెతుక్కుని కొనుక్కునే అవకాశం ఉన్నా... ఫ్లాష్ ప్రచారం కారణంగా అదే మోడల్ కోసం ఎదురు చూడటం... అప్పటికి దొరక్కుంటే మళ్లీ తరువాతి తేదీ కోసం వేచి చూడటం చేయాల్సి వస్తోంది.

ఇవీ ఫ్లాష్ వాస్తవాలు...
 ఇక ఫ్లాష్ సేల్ వాస్తవాల్లోకి వస్తే మైక్రోమ్యాక్స్ ఫ్లాష్ సేల్‌లో భాగంగా జనవరి 13న ‘యురేకా’ మోడళ్లను తొలిసారి విక్రయించినప్పుడు చాలా మంది కస్టమర్లకు ఎర్రర్ పేజీ దర్శనమిచ్చింది. ఇతర కంపెనీల ఫ్లాష్ సేల్ సమయంలోనూ ఇలాంటివే చోటు చేసుకున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గతేడాది ‘బిగ్ బిలియన్ డే’ సేల్ జరిపినపుడు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియంది కాదు. పేజీ తెరుచుకోకపోవటం, తెరుచుకున్నా పేమెంట్ వరకూ వెళ్లకపోవటం, వెళ్లినా ఆర్డర్ ఓకే కాకపోవటం వంటి పలు సమస్యలు తలెత్తాయి. దీనికి ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది కూడా. ఒకే సమయంలో వేలమంది ప్రయత్నించిన సందర్భాల్లో చాలా వెబ్‌సైట్ల విషయంలో ఇలాగే జరుగుతుంది. అదేం అసహజం కాదుకూడా.
 
ఇవి ప్రత్యేకమైనవేమీ కావు...
ఇదంతా మార్కెటింగ్ వ్యూహం. ఇలా ఫ్లాష్ సేల్‌లో విక్రయిస్తున్న ప్రతి మోడలూ ప్రత్యేకమైనదేమీ కాదు. ఒక ఫోన్ కొనుక్కోవడానికి  కస్టమర్ అన్ని రోజులపాటు వేచి చూడాల్సిన పని కూడా లేదు. ఫ్లాష్ సేల్‌లో విక్రయిస్తున్న మోడల్స్‌ను పోలిన ఫోన్లు మార్కెట్లో బోలెడన్ని దొరుకుతున్నాయి. కాబట్టే కొన్ని కంపెనీలు తమ ఫోన్లను ఎలాగైనా విక్రయించుకోవటానికి ఈ ఫ్లాష్ సేల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.
 - వై.గురు, సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ
 
విలువ ఉంటేనే విక్రయం..

ఉత్పాదన కోసం కస్టమర్‌ను కొన్ని రోజులపాటు ఊరించటమంటే కృత్రిమ కొరత సృష్టించటమే. ఉపకరణాల అమ్మకానికి ఫ్లాష్ సేల్ చక్కని వేదిక. అయినప్పటికీ భారత్‌లో ఈ విధానం అన్ని సందర్భాల్లోనూ విజయవంతం కావడం కష్టమే. భారతీయులు విలువను చూస్తారు. తదుపరి ఫ్లాష్ సేల్‌లో విక్రయించే ఉత్పాదనలో మరిన్ని ఫీచర్లు జోడించారా లేదా అనేది కస్టమర్ బేరీజు వేసుకుంటాడు.  కొత్తదనం కనిపిస్తేనే ఓకే చెబుతారు.
- అరవింద్ వోరా, జియోనీ ఇండియా హెడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement