
ఆండ్రాయిడ్ ఫోన్లలోకి మాల్వేర్ భూతం ‘జుడీ’
ప్రపంచ వ్యాప్తంగా 3.65 కోట్ల ఫోన్లపై ప్రభావం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికించిన వాన్న క్రై హ్యాకర్ల ఉదంతం మరిచిపోక ముందే జుడీ అనే మాల్వేర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొచ్చుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 3.65 కోట్ల ఫోన్లు ఇప్పటికే ఈ మాల్వేర్ దాడికి గురై ఉండొచ్చని భావిస్తున్నారు. సెక్యూరిటీ సొల్యూషన్లను అందించే చెక్ పాయింట్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఫోన్లలోకి చొరబడిన ఈ మాల్వేర్ ఆయా ఫోన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రకటనలపై క్లిక్‌లు చేస్తుంటుంది.
దీని ద్వారా ఆ మాల్వేర్‌ను జొప్పించిన వారు భారీ ఆదాయాన్ని గడిస్తున్నట్టు చెక్ పాయింట్ తెలిపింది. ఏకంగా గూగుల్ అధికారిక ప్లే స్టోర్‌లోని యాప్స్‌లోనే ఇది తిష్ట వేసినట్టు బయటపడింది. కొరియన్ కంపెనీ అభివృద్ధి చేసిన 41 యాప్స్‌లో ఈ ఆటో క్లిక్ యాడ్వేర్ (జుడీ)ని గుర్తించినట్టు చెక్ పాయింట్ పేర్కొంది. ‘‘కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. అవన్నీ ఇటీవలే అప్ డేట్ చేసినవి. ఈ యాప్స్‌లో హానికారక కోడ్ ఎప్పటి నుంచి ఉందన్నది స్పష్టత లేదు’’ అని చెక్‌పాయింట్ వివరించింది. కాగా, ఈ సంస్థ గుర్తించిన తర్వాత గూగుల్ ఆయా యాప్స్‌ను తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది.