ఆపిల్ కంపెనీకి లక్ష కోట్ల లాభాలు
ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అమెరికాలో ఎదురులేని అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన ఆపిల్ కంపెనీ లాభాల బాటలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో లక్ష కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ పబ్లిక్ కంపెనీలో త్రైమాసిక కాలంలో ఇంత లాభాలను సాధించడం చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఇంతటి లాభాలు రావడానికి తమ ఉత్పత్తుల్లో 70 శాతం అమ్మకాలు చైనాలో జరగడం వల్లనేనని ఆయన చెప్పారు. రానున్న కాలంలో చైనాలో తమ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
గత డిసెంబర్ 27 నాటికి ముగిసిన కంపెనీ తొలి త్రైమాసిక కాలంలో దాదాపు ఏడున్నర కోట్ల ఐ ఫోన్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిపుణుల అంచనాలకు మంచి ఐఫోన్ల అమ్మకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. ఐపాడ్‌ల అమ్మకాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే 2014 సంవత్సరంలో ఐపాడ్‌ల అమ్మకాలు దాదాపు 18 శాతం పడిపోయాయని ఆయన తెలిపారు.
ఐఫోన్ 6 ప్లస్ మోడల్‌కు మొదట్లో ఆశించిన స్థాయిలో మార్కెట్ లేకపోయినా తర్వాతి కాలంలో మార్కెట్ పుంజుకోవడం ఆపిల్ కంపెనీ లాభాలు పెరగడానికి కూడా దోహదపడిందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఓ మై గాడ్, ఇది నమ్మశక్యంకాని విషయం. సెలవుల్లో ఐఫోన్లకు గిరాకీ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు ఊహించాయి. ఏకంగా ఏడు కోట్లకు పైగా యూనిట్లు అమ్కుడుపోతాయని ఎవరూ కలనైనా ఊహించలేదు’ అని కల్ట్ ఆఫ్ మ్యాక్ వెబ్‌సైట్ ఎడిటర్ బస్టర్ హైన్ వ్యాఖ్యానించారు. చైనాలో మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఆపిల్ కంపెనీ బాగా లాభపడిందని, ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన ‘చైనా మొబైల్’తో ఆపిల్ ఒప్పందం చేసుకోవడం ఫలించిందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.