ఐఫోన్ కు ఎదురేలేదు!
న్యూయార్క్: ఎంత పోటీ ఉన్నా ఆపిల్ ఐఫోన్ కు తిరుగులేదని మరోసారి రుజువైంది. మార్కెట్ లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వస్తున్నా ఐఫోన్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా గణింకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచింది. 2016 ద్వితీయ త్రైమాసికంలో అత్యధికంగా 1.42 కోట్ల(14.2 మిలియన్లు) ఐఫోన్ 6ఎస్ అమ్ముడైనట్టు మార్కెట్ అధ్యయన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది 4 శాతమని తెలిపింది.
2 శాతం వాటాతో ఐఫోన్ 6 రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 85 లక్షల ఐఫోన్ 6 అమ్ముడయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మూడో స్థానం(83 లక్షలు) దక్కించుకుంది. గతేడాదితో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. నిరుడు ద్వితీయ త్రైమాసికంలో 33 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 34 కోట్లు సేల్ అయ్యాయి.