
బిట్‌కాయిన్‌పై జైట్లీ సమావేశం
బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల వల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
వర్చువల్ కరెన్సీలతో ఎదురయ్యే సమస్యలపై చర్చలు
న్యూఢిల్లీ: బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల వల్ల ఎదురయ్యే సమస్యలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ మహర్షి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్‌రాయ్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులీ చిబ్ దుగ్గల్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బిట్ కాయిన్‌పై చర్చించినప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో బిట్‌కాయిన్‌పై దేశీయంగా పెట్టుబడులు పెట్టేవారు పెరిగిపోతుండటంతో దీన్ని ప్రాధాన్య అంశంగా కేంద్రం పరిగణిస్తోంది.
వర్చువల్ కరెన్సీలకు సంబంధించి దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని ఎదుర్కొనే విషయమై చర్యలు సూచించేందుకు గాను ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ ఓ కమిటీని నియమించింది. బిట్‌కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలను చట్టబద్ధం చేసే విషయంలో గత నెలలో ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా ఆహ్వానించింది. మరోవైపు వర్చువల్ కరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆర్‌బీఐ సైతం దీనిపై పెట్టుబడి పెట్టేవారిని, ట్రేడర్లను ఇటీవలి కాలంలో పలుమార్లు హెచ్చరించింది కూడా. దేశీయంగా బిట్ కాయిన్‌లో ట్రేడింగ్‌కు పలు ఎక్సే్చంజ్‌లు ఉండగా, ఒక్క ‘జెబ్‌పే’ సంస్థలోనే రోజూ 2,500 మంది చేరుతుండటం దీనికున్న ఆకర్షణకు నిదర్శనం. ఇటీవల వన్నా క్రై వైరస్‌తో కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపజేసిన సైబర్ నేరగాళ్లు బిట్‌కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేయడంతో, దాని విలువ అమాంతం పెరగడం తెలిసిందే.