
చెన్నై : చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు వచ్చిన రూ.200 నోటు ఏటీఎంలలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతమైతే ఈ నోటు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఏటీఎంలలోకి రావడానికి మాత్రం ఈ ఏడాది ఆఖరి వరకు ఆగాల్సిందేనట. కొత్త సంవత్సరం నాటికి లేదా దాని కంటే ముందు ఏటీఎంల ద్వారా ఈ రూ.200 నోట్లను అందించే అవకాశాలున్నాయని బ్యాంకింగ్ అదికారులు చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, వాటిని రీకాలిబ్రేట్ చేయడానికి మరికొంత కాలం పట్టే అవకాశముందని ఎన్‌సీఆర్ ఎండీ నవ్‌రోజ్ డస్టర్ చెప్పారు. ఎన్‌సీఆర్ దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఏటీఎంలను ఆపరేట్ చేస్తోంది.
ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడం సులువైన పని అని ప్రజలు భావిస్తున్నారని, కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది అని కెనరా బ్యాంక్ ఛైర్మన్ రాకేశ్ శర్మ అన్నారు. రీకాలిబ్రేషన్‌కు చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియని, దీనికోసం వారాల తరబడి సమయం పడుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు సమయంలో రాత్రింబవళ్లు కష్టపడ్డామని, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రెండు వారాల్లో మార్చామని తెలిపారు. ప్రస్తుతం అంత తొందరపాటు ఏమీ లేదన్నారు. కొంత సమయం తీసుకుని ఏటీఎంలను రీకాలిబ్రేషన్ చేపడతామని రాకేశ్ శర్మ చెప్పారు. ప్రస్తుతం తన నెట్‌వర్క్‌లో 10వేలకు పైగా ఏటీఎంలను కెనరా బ్యాంకు కలిగి ఉంది.