పబ్లిక్ ఆఫర్... పదపద!
⇒ ఈ ఏడాది కంపెనీల సమీక్షరణ లక్ష్యం రూ.40,000 కోట్లు
⇒ ఇప్పటికే ఐదు ష్యూలకు సెబీ ఆమోదం
⇒ ఆర్థిక రంగానికి చెందినవే అధికం...
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్(ఐపీఓ)లో జోరు ఈ ఏడాది కూడా కొనసాగనున్నది. గత ఏడాది ఐపీఓల ద్వారా 26 కంపెనీలు రూ.26,000 కోట్లు సమీకరించాయి. ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంతకు మించి నిధుల సమీకరణ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో మార్కెట్ మంచి లాభాల్లో ఉండడం, లిస్టింగ్ లాభాల కోసం హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ అధికంగా బిడ్‌లు వేయడం వంటి కారణాల వల్ల పలు కంపెనీలు నిధుల సమీకరణకు ఇదే సరైన తరుణమని ఐపీఓలకు సై అంటున్నాయి. తమ తమ వ్యాపారాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీలు ఐపీఓలకు వస్తున్నాయి. షేర్ల విక్రయానికి ప్రోత్సహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు చర్యలు తీసుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత ఊపునిచ్చింది. సెబీ తీసుకుంటున్న చర్యలు ఐపీఓల్లో మోసాలు జరగవన్న భరోసాను ఇన్వెస్టర్లకు ఇచ్చింది.
రూ.40,000 కోట్ల ఐపీఓలు...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.40,000 కోట్లు మేర పెట్టుబడులు సమీకరించే అవకాశాలున్నాయని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ హెడ్(ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్) వి. జయశంకర్ అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్విప్) ద్వారా కంపెనీలు రూ.20,000–25,000 కోట్ల రేంజ్‌లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో వచ్చిన సెంట్రల పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్(సీసీఎస్‌ఈ) ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) కూడా విజయవంతం కావడంతో, ఇదే ట్రెండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగవచ్చని జయకుమార్ అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకూ మూడు కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. అన్నీ ఓవర్‌సబ్‌స్కైబయ్యాయి. అంతేకాకుండా లిస్టింగ్‌లోనూ మంచి లాభాలు సాధించాయి. ఈ ఏడాది మొదట్లో బీఎస్‌ఈ ఐపీఓకు వచ్చింది. అ తర్వాత రేడియో సిటీ చానెళ్లను నిర్వహించే జాగరణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్, డి–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపీఓకు వచ్చాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్‌లో బంపర్ లాభాలను అందించాయి. అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ అయితే 114 శాతం లిస్టింగ్ లాభాలనిచ్చింది. ఇక సీఎల్ ఎడ్యుకేట్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఐపీఓలు పూర్తయ్యాయి. ఇవి లిస్టింగ్ కావలసి ఉంది.
ఐదు కంపెనీలకు అనుమతి
మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ప్రస్తుతం ఐదు కంపెనీలు ఐపీఓకు అనుమతి పొందాయి. హడ్కో, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, ఎస్. చాంద్ అండ్ కంపెనీ, జెనిసిస్ కలర్స్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌లకు సెబీ ఆమోదం లభించింది. ఇక గీతాంజలి జెమ్స్‌కు చెందిన నక్షత్ర వరల్డ్, జీటీపీఎల్, హాత్‌వే, ఎన్‌ఎస్‌ఈ, భారత్ రోడ్ నెట్‌వర్క్, తేజాస్ నెట్‌వర్క్స్, ఇరిస్ లైఫ్ సైన్సెస్, సల్సార్ టెక్నో ఇంజినీరింగ్, ఏయూ ఫైనాన్షియర్స్, ప్రతాప్ స్నాక్స్, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్, కొచ్చిన్ షిప్‌యార్డ్.. ఈ కంపెనీలన్నీ సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక భారీ ఐపీఓల విషయానికొస్తే, ఎన్‌ఎస్‌ఈ రూ.10,000 కోట్లు, ఎస్‌బీఐ లైఫ్ కూడా పెద్ద మొత్తంలోనే నిధులు సమీకరించనున్నాయి.
ఆర్థిక రంగం నుంచి అధికంగా...
గత ఏడాది ఆర్థిక, కన్సూమర్, రిటైల్, రంగ కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది అధికంగా ఆర్థిక రంగ కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18)లో ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యూ ఇండియా ఎష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లు రానున్నాయి.
వరుసలో పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలు
స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్న తొలి ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీగా జీఐసీ–రి నిలవనుంది. ఈ కంపెనీ లిస్టింగ్ ప్రయత్నాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) వేగవంతం చేసింది. ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని 54 జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలకు రీ ఇన్సూరెన్స్ తోడ్పాటునందించే ఈ జీఐసీ–రి లో ప్రభుత్వానికి 100% వాటా ఉంది. రూ.5 ముఖవిలువ గల ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. ఇక న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ కూడా తన ఐపీఓ కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఏడు వరకూ మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనున్నది.