
న్యూఢిల్లీ: ‘ఆడి’ కారు కొనేవారికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ తాజాగా భారత్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10 లక్షల వరకు పరిమిత కాల డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ తగ్గింపు జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుంది.
దిగుమతి సుంకం పెంపు తర్వాత మార్కెట్‌లో తలెత్తిన సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఏ3, ఏ4, ఏ6 సెడాన్ కార్లు సహా క్యూ3 ఎస్‌యూవీపై రూ.2.7 లక్షలు–రూ.10 లక్షల శ్రేణిలో తగ్గింపు పొందొచ్చని తెలిపింది. ‘కస్టమర్లకు కఠినమైన దిగుమతి సుంకాలు, ప్రతికూల పన్ను వాతావరణం వంటివి అడ్డు రాకూడదు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారి చెప్పారు.
పన్ను బాదుడు వల్లే...
2018–19 బడ్జెట్‌లో.. మోటార్ వెహికల్స్, మోటార్ కార్స్, మోటార్ సైకిల్స్ కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్ (సీకేడీ) దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అలాగే కేంద్రం మోటార్ వెహికల్స్, మోటార్ కార్స్, మోటార్ సైకిల్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన విడిభాగాలు, యాక్ససిరీస్‌లపై కూడా కస్టమ్స్ డ్యూటీని 7.5% నుంచి 15%కి పెంచింది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్ల కంపెనీలు వాటి వాహన ధరలను రూ.లక్ష నుంచి రూ.10 లక్షల శ్రేణిలో పెంచాయి.
‘2018 కార్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేశాం. కానీ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపు వల్ల కార్ల ధరలను పెంచాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది అమ్మకాలు ఫ్లాట్‌గా ఉండొచ్చు’ అని అన్సారి చెప్పారు. ‘గతేడాది జీఎస్‌టీ వల్ల అధిక డిస్కౌంట్‌ను ఆఫర్ చేశాం. దీనివల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే ఫార్ములాను ఇప్పుడూ అనుసరిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే ఎంపిక చేసిన మోడళ్లపై 57 శాతం బైబ్యాక్ అష్యూరెన్స్ పొందొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment