హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ స్థాయిలో... హైదరాబాద్‌లో రెండేళ్లకోసారి జరిగే ‘ఇండియా ఏవియేషన్ షో’ తేదీలు ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా ‘వింగ్స్ ఇండియా 2018’ థీమ్‌తో మార్చి 8 నుంచి 11 వరకు ఇది జరుగనుంది. 150కి పైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి.
5,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పౌర విమానయాన రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలకు వింగ్స్ ఇండియా వేదిక కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. విధానపర అంశాలు, వ్యాపార అవకాశాలపై సదస్సులు నిర్వహిస్తారు. పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, ఎయిర్ ఇండియా, పవన్ హాన్స్ సహకారం అందిస్తున్నాయి.
చిన్న విమానాలతోనే..
దిగ్గజ సంస్థలు రూపొందించిన నూతన తరం ప్రైవేట్ జెట్లు ఈ ప్రదర్శనలో తళుక్కుమననున్నాయి. ఎనిమిది కొత్త జెట్స్ తొలిసారిగా దర్శనమివ్వనున్నాయి. వీటిలో 14 సీట్లతో కూడిన ఫా ల్కన్ ఒకటి. గతంలో జరిగిన ఏవియేషన్ షోలలో భారీ విమానాలు కనువిందు చేశాయి. భారీ విహంగమైన ఎయిర్‌బస్ ఏ380ని చూసేందుకు వీక్షకులు ఎగబడ్డారు.
ఈసారి ఇలాంటివి ఉండవని, పూర్తిగా బిజినెస్ టు బిజినెస్ ఈవెంట్‌గానే ఇది ఉంటుందని విమానయాన రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీ వ్యవస్థాపకుడొకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రైవేట్ జెట్స్ మాత్రమే కొలువుదీరతాయన్నారు. ఇక ఎప్పటిలాగే ఏరోబాటిక్ ప్రదర్శన హైలైట్‌గా నిలవనుంది. తొలి రెండు రోజులు బిజినెస్ విజిటర్లకు, చివరి రెండు రోజులు సాధారణ ప్రజానీకానికి కేటాయించారు. బిజినెస్ టికెట్ రూ.1,500, జనరల్ టికెట్ రూ.300 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment