నగరంలో ఏవియేషన్ షో
మార్చి 16 నుంచి 20 వరకు వేడుకలు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఏవియేషన్ షో-2016కు హైదరాబాద్ వేదిక కానుంది. మార్చి 16 నుంచి 20 వరకు బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించే ఈ వేడుకను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. ‘ఇండియా సివిల్ ఏవియేషన్ రంగం, పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ అంశం ఇతివృత్తంగా ఈ షో జరుగుతుంది. దీనికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ను మార్చి 17న కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు అశోక్‌గజపతిరాజు ప్రారంభిస్తారు. ఈ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో కేంద్ర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌నయన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష నిర్వహించారు. ‘తొలి మూడు రోజులు వాణిజ్య ప్రతినిధుల కోసం, చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు ఆహ్వానం ఉంటుంది.
ఏ380, ఏ350, ఎయిర్‌బస్747, ఎయిర్‌బస్800, బోయింగ్, డసాల్ట్, గల్ఫ్ స్ట్రీమ్, టెక్స్‌ట్రోన్ విమానాలు, ఆగస్టా వెస్ట్‌లాండ్, బెల్, రష్యన్ హెలికాప్టర్లు ఈ ప్రదర్శనలో ఉంటాయి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం తదితర దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతారు. గ్లోబల్ కంపెనీల సీఈఓలు, విమానయాన సంస్థలు, ఎమ్‌ఆర్‌ఓలు, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, శిక్షణా సంస్థలు, ఇంజిన్ తయారీ కంపెనీలు సీఎఫ్‌ఎం, యుటీసీ, జీఈ లు, కార్గోలతో పాటు గుజరాత్, మహా రాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ షోలో పాలుపంచుకొంటాయి’ అని రాజీవ్‌నయన్ వెల్లడించారు. సీఐఎస్‌ఎఫ్, పోలీసు అధికారులు సమన్వయంతో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రాజీవ్‌శర్మ మాట్లాడుతూ... ఈ షో హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సంబంధిత ఏర్పాట్లపై ఈ నెల 29 లేదా మార్చి1న కేంద్ర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ మరోమారు సమీక్ష నిర్వహిస్తారన్నారు. అంతకుముందు పరిశ్రమ ల కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో కలసి రాజీవ్‌నయన్ బేగంపేట్ విమానాశ్రయంలో పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీఏడీ ముఖ్యకార్యదర్శి అథర్ సిన్హా, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఐజీ అంజనీకుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.