యాక్సిస్ బ్యాంక్ ‘శుభ్ ఆరంభ్’
♦ అందుబాటులోకి కొత్త గృహ రుణ పథకం
♦ కొన్ని ఈఎంఐల మాఫీ ప్రయోజనం
ముంబై: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొత్తగా ‘శుభ్ ఆరంభ్‘ పేరిట మరో గృహ రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రుణ చెల్లింపు వ్యవధిలో కొన్ని నెలవారీ వాయిదా చెల్లింపులకు (ఈఎంఐ) మినహాయింపు లభించేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. నాలుగు, ఎనిమిది, పన్నెండు సంవత్సరాల చివర్లో నాలుగు ఈఎంఐలను బ్యాంక్ మాఫీ చేస్తుంది. ఇలా 20 ఏళ్ల వ్యవధికి రుణం తీసుకున్నవారికి మొత్తం మీద 12 ఈఎంఐల మేర మాఫీ లభిస్తుంది.
సుమారు రూ. 30 లక్షల రుణంపై మొత్తం మీద రూ. 3.09 లక్షల మేర ఆదా అవుతుందని బ్యాంక్ తెలిపింది. రూ. 30 లక్షల దాకా గృహ రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని, రుణ చెల్లింపు వ్యవధి తగ్గింపు రూపంలో ఈ ప్రయోజనం అందిస్తామని వివరించింది. ఆసాంతం వడ్డీ రేటు స్థిరంగా 8.35 శాతంగానే కొనసాగుతుందని పేర్కొంది. ఒకవేళ ఏ ఒక్క ఈఎంఐని చెల్లించకపోయినా.. వారికి ఈ పథకం ప్రయోజనాలు లభించవు.